Best Web Hosting Provider In India 2024
ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్ర రాజకీయాలు
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక జరగనివి జరిగినట్లు చిత్రీకరణ
ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన రుషికొండ భవనాలపైనా అవాకులు చెవాకులు
రుషికొండ భవనాలపై దిగజారుడు మాటలతో రెచ్చిపోయిన సీఎం
హైదరాబాద్ పార్క్ హయత్‌లో కాపురం పెట్టి రూ.30 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టించింది ఎవరు?
ఉండవల్లి, అమరావతి, ఢిల్లీ క్యాంపు ఆఫీసులకు రూ.కోట్లు ఖర్చు చేసిందెవరు?
హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్ మరమ్మతులకు ప్రభుత్వ సొమ్ము వెచ్చించిందెవరు?
అవన్నీ మరిచి ప్రభుత్వ భవనాలపై అన్యాయంగా నిందలు
రెండేళ్ల క్రితం జరిగిన విజయమ్మ వాహన ప్రమాదంపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణంగా దుష్ప్రచారం
టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని విష ప్రచారం చేసి అభాసుపాలు
బోట్లతో గుద్ది ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ నిందలు
వాస్తవానికి విజయవాడలోకి వరదను మళ్లించింది మీరు కాదా బాబూ?
కొద్ది రోజులు మదనపల్లె ఫైల్స్..ఇంకొన్ని రోజులు కాదంబరి పేరుతో హడావుడి.. 5 నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ అమలుపై మీనమేషాలు
దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తరచూ ఏదో ఒక అంశంపై రాజకీయం
డైవర్షన్ పాలిటిక్స్‌లో తనకెవరూ సాటిరారని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్న వైనం
ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం రూ.430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని గుడ్లప్పగించి చూస్తూ.. నోరెళ్లబెట్టిన చంద్రబాబు.. గట్టిగా వానొస్తే నీళ్లు కారేలా ఏకంగా రూ.2,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఏ లెక్కన నిర్మించారు? ఇప్పుడు ఈ తాత్కాలిక కట్టడాలను కూల్చేసి.. శాశ్వత భవనాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు? తన విలాసాల కోసం చేసిన ఖర్చు ఎవరికి తెలియదు? కుట్రలు, దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న ఈ పెద్దమనిషికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంతకైనా దిగజారుతానని మరోమారు నిరూపించుకున్నారు.
అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు విష ప్రచారాలనే నమ్ముకున్నారు. జరగని వాటిని జరిగినట్లు, లేని విషయాలను ఉన్నట్లు ఎడతెగని దుష్ప్రచారం చేస్తూ రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ తన పని మరచిపోయి, రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాల వద్దకు వెళ్లి అవాకులు చెవాకులు పేలారు.
గంట సేపు అక్కడ గడిపి వీడియో, ఫొటో షూట్‌లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని.. రాజులు, చక్రవర్తులు ఇలాంటివి కట్టించుకుంటారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. కమోడ్‌కు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. 2014లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నెలల తరబడి కుటుంబంతో ఉండి రూ.30 కోట్ల బిల్లును ప్రభుత్వంతో కట్టించిన విషయాన్ని మరచిపోయారు. ఉండవల్లి, హైదరాబాద్, ఢిల్లీలోని తన క్యాంపు ఆఫీసులకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు కట్టడాన్ని తప్పుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది.
హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫామ్‌హౌస్‌లో మరమ్మతులకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాలపై అడ్డగోలు నిందలు మోపుతూ శుద్ధపూస కబుర్లు చెప్పడాన్ని ఏమనాలి? రుషికొండపై టూరిజం శాఖ రూ.430 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాల కోసమేననే విషయాన్ని పక్కదారి పట్టించి వైఎస్ జగన్ కోసం నిర్మించినట్లుగా దాన్ని చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి ఒక ఉదాహరణ.
ఇందులో భూమి చదును చేయడానికే ఎక్కువ మొత్తం ఖర్చయింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల కోసం ఇదే చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు వీటిని కూలగొట్టి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారో ఆయనే సెలవివ్వాలి.
ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్
⇒ హనీ ట్రాప్‌ల మాయలేడి, ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వాని కేసును తెరపైకి తెచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయించారు. పారిశ్రామికవేత్తలు, ధనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్‌తో బ్లాక్ మెయిల్ చేసే కేసును ఏపీ పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తే, దాన్ని కూడా రాజకీయం చేసి ఆమెకు వత్తాసు పలికి రాచమర్యాదలు చేయించారు చంద్రబాబు.
⇒ మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని వైఎస్సార్‌సీపీ కావాలని చేసిందంటూ ఆ ఘటనను రాజకీయానికి వాడుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లు తగుల బెట్టించడానికి ఇది చేయించారంటూ అడ్డగోలు వాదనకు దిగి కేసులు పెట్టి నానా రభస సృష్టించారు. డీజీపీని హెలికాప్టర్‌లో అక్కడికి పంపించారు. ఆ కేసులో ఇంతవరకు ఏమీ నిరూపించలేకపోయారు.
⇒ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడల్లా ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయనపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, ఆయన కూటమి పనిగా పెట్టుకుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోననే భయంతో ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని ప్రతిరోజూ బయట పెట్టుకుంటున్నారు. మోసం, నయవంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటినే ఆలంబనగా చేసుకుని తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి వాటిని పక్కదారి పట్టించేందుకు దారుణంగా దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు.
రెండేళ్ల క్రితం ప్రమాదంపై అడ్డగోలుతనం
రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు జరిగినట్లు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడో 2022లో విజయమ్మ వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పంక్చర్ అయితే, దాన్ని ఇటీవలే జరిగినట్లు.. దాని వెనుక కుట్ర ఉన్నట్లు, జగన్ కావాలని చేయించినట్లు అనుమానాలు కలిగేలా టీడీపీ సోషల్ మీడియా మూడు రోజులుగా వైరల్ చేస్తూ శునకానందం పొందుతోంది.
అబద్ధానికి రెక్కలు తొడిగి పబ్బం గడుపుకునే చంద్రబాబుకు, ఆయన పరివారానికి కనీస విచక్షణా జ్ఞానం లేదని, కుట్రతో బురద జల్లడమే తెలుసని ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని రెండేళ్ల తర్వాత తెరపైకి తెచ్చి, దానిపై ఆరోపణలు చేయడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట.
శ్రీవారి సాక్షిగా అబద్ధాలు
కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలనే వేదికగా చేసుకుని వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు అభాసుపాలయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని దారుణమైన అబద్ధాన్ని పదే పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. వేంకటేశ్వరస్వామి తన కుల దైవం అని చెప్పుకుంటూనే ఆయన్ను రాజకీయంలోకి లాగి చివరికి సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారు. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలడంతో దానిపై అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, ఆయన అనుయాయుల నోళ్లు మూత పడ్డాయి.
బెజవాడ వరదల్లోనూ రాజకీయం
విజయవాడ వరదలను ఎదుర్కోవడంలో దారుణంగా వైఫల్యం చెంది లక్షలాది మందిని నీటిలో ముంచిన చంద్రబాబు… ఆ విషయం నుంచి రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయడానికి జగన్ పథకం పన్నారంటూ విష ప్రచారం చేశారు. వరదలో కొట్టుకువచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డం పడితే, దాన్ని రాజకీయం చేసి వైఎస్సార్‌సీపీయే కావాలని బోట్లతో గుద్దించిందని, దీని వెనుక జగన్ ఉన్నారని చెబుతూ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చరిత్రలో ఇంతటి దగుల్బాజీ రాజకీయం చంద్రబాబు తప్ప వేరెవరూ చేయలేరని ఆ కేసు ద్వారా నిరూపించుకున్నారు. వాస్తవానికి వరద నీటిని నగరంలోకి మళ్లించిందే చంద్రబాబు. ఆ పడవలన్నీ టీడీపీ వాళ్లవే.