Best Web Hosting Provider In India 2024
ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారంలో ఉన్నా.. ఏ రంగమైనా విమర్శలు అనేవి ప్రస్తుత కాలంలో సహజంగా మారిపోయాయి. అయితే, కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువగా ఇవి ఎదురవుతుంటాయి. కొన్ని విమర్శలు అర్థవంతంగా ఉంటాయి. అయితే, ఒక్కోసారి అసంబద్ధమైన విమర్శలు కూడా భరించాల్సి రావొచ్చు. అయితే, విమర్శల వల్ల కొందరు కుంగుబాటుకు గురవుతారు. తీవ్ర ఆందోళన చెందుతారు. అయితే, విమర్శలను ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. వాటిని విశ్లేషించుకొని మరింత రాటుదేలాలి. హీరో కిరణ్ అబ్బవరం ఈ సూత్రాన్ని మరోసారి నిరూపించారు.
అబ్బవరంపై విమర్శల హోరు
హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాజా వారు రాణి గారు (2019), ఎస్ఆర్ కల్యాణ్ మండపం (2021) చిత్రాలు హిట్ అవటంతో చాలా సంతోషించారు. అయితే, ఆ తర్వాత రెండేళ్లలో ఆరు సినిమాలు చేస్తే.. అన్నీ ప్లాఫ్ అయ్యాయి. హీరో కిరణ్ అబ్బవరంపై విమర్శలు వెల్లువెత్తాయి. కథతో సంబంధం లేకుండా వచ్చిన సినిమాలన్నీ చేస్తున్నారంటూ ట్రోలింగ్ జరిగింది. యాక్టింగ్ కూడా సరిగా రాదని, స్క్రిప్ట్ సెలెక్షన్ తెలియదా అంటూ అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా మంది వెటకారం చేశారు. కిరణ్ అబ్బవరంపై విమర్శల హోరు నానాటికీ పెరిగింది.
విమర్శలతో రాటుదేలి..
వరుస పరాజయాలతో తీవ్రమైన విమర్శలు వచ్చినా కిరణ్ అబ్బవరం కుంగిపోలేదు. బాధపడినా.. గెలువాలన్న కసి మరింత పెంచుకున్నారు. అందుకే.. కాస్త గ్యాప్ తీసుకొని విభిన్నమైన స్టోరీలైన్తో ఉన్న ‘క’ సినిమా చేశారు. దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఆ చిత్రం హిట్ అవడమే కాక ప్రశంసలను దక్కించుకుంటోంది. కథలను ఎంపిక చేసుకోవడం రాదంటూ ఒకప్పుడు విమర్శించిన చాలా మంది.. మంచి కథతో మూవీ చేశావంటూ కిరణ్ అబ్బవరంను ప్రశంసిస్తున్నారు. వైఫల్యాల్లో ఉన్నప్పుడు వచ్చిన విమర్శలను కిరణ్ విశ్లేషించుకోవడం, కష్టపడడం వల్లే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కుంగుబాటుకు గురి కాకుండా పరిష్కారాన్ని కనుగొన్నారు.
చాలా మంది నుంచి వచ్చిన అభిప్రాయాలను కిరణ్ అబ్బవరం పరిగణనలోకి తీసుకున్నారని ఆయన భార్య, నటి రహస్య గోరక్.. ‘క’ సినిమా ప్రమోషన్లలో చెప్పారు. అంటే.. విమర్శలను అబ్బవరం ఎంత విశ్లేషించుకున్నారో.. ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది. జోరుగా వచ్చిన విమర్శలే కిరణ్ అబ్బవరంను మరింత రాటు దేల్చాయి, మార్పు తెచ్చాయి. విమర్శల పట్ల తాను బాధపడ్డానని కిరణ్ చెప్పినా.. వాటి వల్ల విజయం పట్ల ఎంతటి కసి పెరిగిందో ఈ మూవీ ప్రమోషన్లలో అతడిలో మాటలను బట్టి స్పష్టంగా అర్థమైంది. విమర్శలకు కుంగిపోకుండా.. వాటి విశ్లేషించుకొని ముందుకు సాగి కష్టపడితే సక్సెస్ తప్పకుండా దరి చేరుతుందని ఇప్పటికే ఇప్పటికే కొందరు నిరూపించారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అందుకు మరో ఉదాహరణగా నిలిచారు.
ఇవి మీరూ ఫాలో కండి
విమర్శలు ఎదురైతే ముందుగా చాలా మంది బాధపడడమో.. లేకపోతే కోప్పడడమో చేస్తుంటారు. అయితే, విమర్శ ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని తప్పకుండా ఆలోచించాలి. దానికి మూల కారణం ఏంటి అనేది గుర్తించాలి. ఒకవేళ విమర్శలు అర్థవంతమైనవే అయితే తప్పకుండా సీరియస్గా తీసుకోవాలి. విశ్లేషించుకోవాలి. కావాల్సిన మార్పులు చేసుకోవాలి. విమర్శలకు పనితోనే సమాధానం ఇచ్చేందుకు కష్టపడాలి. వాటిని ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. కుంగుబాటుకు అసలు గురికాకూడదు. విమర్శించిన వారే శభాష్ అనుకునేలా చేసి చూపించాలి.