Best Web Hosting Provider In India 2024
ఏపీలో జరుగుతున్న అరాచకాలపై వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సీరియస్
అరాచకాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం
నేరుగా డిప్యూటి సీఎం పవన్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు
పవన్ తప్పుపట్టాల్సింది హోం మంత్రిని కాదు..సీఎం చంద్రబాబును అనాలి
కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది
వైయస్ఆర్ జిల్లా : కూటమికి ఓటేసిన మహిళలు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారని, బాధపడుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని కూటమి ప్రభుత్వంపై శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్నా.. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు. మంగళవారం ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిందితులకు వెన్నులో వణుకు పుట్టాలి
దాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కూటమి నేతలకు మాత్రం దున్నపోతుపై వానపడ్డట్లుంది.. ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయితే ప్రభుత్వం ఎంత సీరియస్‌గా స్పందించాలి..? నిజంగా అంత సీరియస్‌గా ఈ ప్రభుత్వం స్పందించి ఉంటే వంద సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ప్రారంభంలోనే వెన్నులో వణుకు పుట్టించి ఉంటే ఇలా జరిగేది కాదు.
కూటి ప్రభుత్వంది పేరు గొప్ప.. ఊరు దిబ్బ
ఈ నేతలు కేవలం మాటలకు మాత్రమే పరిమితి.. చేతలు శూన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వాటిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. నిత్యం వైఎస్ జగన్‌ను నిందించడం..టీడీపీ గొప్పలు చెప్పకోవడం తప్ప చేసిందేమీ లేదు. సెల్ ఫోన్ మేమే కనిపెట్టాం..హైదరాబాద్‌కు బీచ్ తెచ్చాం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీరు చేసిందేమీ లేదు. కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.మా కులం, మా పార్టీ అని నేరానికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏమో కానీ దేవుడి వద్ద మాత్రం మీకు శిక్ష తప్పదు. మూడేళ్ల చిన్నారిపై దారుణం జరిగితే నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలి. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. వాళ్లకు ఓటు వేసిన ప్రతి తల్లి, చెల్లి కూటమి నేతలను చూసి సిగ్గు పడుతున్నారు.
ప్రభుత్వ అసమర్ధతను పవన్ అంగీకరించారు
పవన్ కల్యాణ్ జరిగిన తప్పును, వారి అసమర్ధతను కనీసం ఒప్పుకున్నారు. మా హోం మంత్రి శాంతిభద్రతల విషయంలో విఫలమయ్యిందని అంగీకరించారు. పవన్..పరోక్షంగా సీఎం చంద్రబాబునే అన్నారు. నేరుగా చంద్రబాబును అనే ధైర్యం లేక హోం మంత్రిపై పెట్టి అన్నారు. శాంతిభద్రతలు దెబ్బతింటుంటే క్యాబినెట్‌కు బాద్యత లేదా..? ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా?. మీకు మానం, మర్యాద ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి..అధికారంలో కొనసాగే అర్హతే మీకు లేదు. పైపెచ్చు పోలీసులపై నిందలు వేస్తున్నారు. పోలీసులకు మీరు స్వతంత్య్రం ఇచ్చారా..? ఈ ఎస్పీలు, ఇంటిలిజెన్స్ అధికారులు మొదటి నుంచీ ఉన్నారు..గతంలో ఇలా జరగలేదేం..?.ఇలా జరగడానికి కారణం నేరం చేసే వారి ఆలోచనలు పెచ్చురిల్లిపోతున్నాయి…చిన్నపిల్లల్ని సైతం వదలడం లేదు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
దానికి తోడు విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్ధాలు..నేరస్థుడికి ఇవి ఊతం ఇస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మద్యం, గంజాయి దొరికితే నేరస్థులు రాక్షసులు కారా..? పోలీసుల విధి నిర్వహణకు మీరు మోకాలడ్డుతున్నారు కాబట్టే పరిస్థితి ఇలా ఉంది. మీరు పోలీసులకు స్వేచ్ఛనిస్తే ..వారు కఠినంగా వ్యవహరించే వారు. మీరు తప్పు చేసి పోలీసులపై నింద వేస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మీ ఆత్మన్యూనత భావంతో పోలీసులను విమర్శిస్తున్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరేం చేశారు?
దిశా చట్టాన్ని పదును పెట్టండి. పోలీసులకు స్వేచ్చనివ్వండి..నేరం జరుగుతుందా?. తాను తప్పించుకోగలను..అనే ధైర్యం నేరస్థుడిలో రాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఓ బిడ్డ జరిగిన అన్యాయాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుంది?. ఇలా ఎంత మంది తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటారు..? వీటన్నిటినీ పక్కదోవ పట్టించేందుకు వైఎస్ జగన్‌పై డైవర్షన్ పాలిటిక్స్ రోజుకొకటి చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో ఏముంది..? ఏ అబివృద్ధి లేకపోయినా పర్వాలేదు..కనీసం మా ఆడబిడ్డలకు రక్షణనైనా కల్పించండి.
తల్లీ.. అనిత..? పవన్ నిన్ను పొగడలేదు
పవన్ కల్యాణ్ నిన్ను పొగిడాడా తల్లీ..అనిత..?హోం శాఖ నేను తీసుకుంటాను అంటుంటే అర్ధం మీరు పూర్తిగా విఫలం అయ్యారనే అర్థం. ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ మీరే మిమ్మల్ని సమర్ధించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి కూడా బాద్యత వహించాలి. మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదు. మా బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడమని కోరితే అది కూడా మీరు చేయలేకపోతున్నారు.
పిల్లల మానాలు, ప్రాణాలు కాపాడలేని నువ్వు..2047కి ఏదో చేస్తానంటున్నావు. ఎప్పుడో ఏదో చేసేది కాదు..ముందు మా బిడ్డలకు రక్షణ కల్పించండి. ఇలాంటి సంఘటన జరిగితే ప్రొద్దుటూరులో పెద్ద స్థాయిలో దీక్షకు దిగుతా’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.