Best Web Hosting Provider In India 2024
హీరో అల్లు అర్జున్‌కి ఏపీ హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల సయమంలో తన స్నేహితుడు, వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు నంద్యాలకి సతీసమేతంగా అల్లు అర్జున్ వెళ్లాడు. దాంతో.. భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోగా.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అప్పట్లో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, రవిచంద్రకిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
మే నెలలో కేసు నమోదు
వాస్తవానికి అప్పుడు ఎన్నికల సమయం కావడంతో.. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. దాంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కానీ.. ఆ కేసుని కొట్టివేయాలంటూ అల్లు అర్జున్, రవిచంద్రకిశోర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దాంతో విచారణ జరిపిన హైకోర్టు.. ఈరోజు ఆ కేసుని కొట్టివేసింది.
శ్రీవారి సేవలో అల్లు అర్జున్ సతీమణి
అల్లు అర్జున్‌పై నమోదైన కేసు గురించి ఈరోజు ఏపీ హైకోర్టు తుది తీర్పు ఉండటంతో.. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తిరుమలలో శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.
రిలీజ్‌కి పుష్ప-2 రెడీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ సీక్వెల్ ‘పుష్ప-2: ది రూల్’ డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఓవర్సీస్‌లో ఒక్కరోజు ముందే అంటే.. డిసెంబరు 4న రిలీజ్‌కానుండగా.. ఇప్పటికే ప్రీమియర్స్ సేల్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. కానీ.. ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే 15 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు ఇంత వేగంగా ఏ ఇండియా మూవీకి కూడా టికెట్లు అమ్ముడుపోలేదట.
పుష్ప-2 రికార్డులు మోత
పుష్ప-2: ది రూల్ మూవీ ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. దాదాపు 11,500 స్క్రీన్స్‌లో ఈ సినిమా రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్ చేయగా.. పుష్ప-2లో శ్రీలీల చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. నవంబరు 15న సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.