Best Web Hosting Provider In India 2024
Karthika Masam: కార్తీకమాసంలో ప్రతిరోజు దగ్గరలో ఉన్న నదిలోనో, చెరువులోనో లేక బావి మొదలైనవాటిలో సూర్యోదయం కాకమునుపే స్నానం చేయటం శుభకరం. కొందరు అనుకొన్నట్లుగా కార్తీక మాస పుణ్య స్నానాలు కేవలం శైవులకే పవిత్రమైనవి కాదు. శైవులు, వైష్ణవు లందరికీ ఇది పవిత్రమైన మాసమే. ఈ నెలరోజులపాటు నిత్యము ప్రాతఃకాల నదీస్నాము, నిత్య దేవాలయ, దైవదర్శనము, శక్తి కొలది చేయుదానము, అవకాశము కొలది చేయు ఉపవాసములు, సాయంకాల దీపదర్శనం, మానవులకు నిత్య శుభములను కల్పిస్తాయి. అందుకే నెల రోజులు పరిపూర్ణ పర్వ దినాలుగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులకు ఇరువురికీ ప్రీతిపాత్రమైనదే.
కార్తీకమాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో ఉండుటచేత ఈ కాలంలో ఆచరించే ఆరాధనలు, వ్రతాలు, దానధర్మాలు, దీపార్చనలు, ఉపవాసాలు, పురాణ శ్రవణం, పురాణపుస్తక దానం అనేక జన్మలలో చేసిన పాపాలను హరించివేస్తాయి.
సూర్యుడు తులారాశిలో ఉండగా మంచి మనస్సుతో ఏ సత్కర్మను చేసినా అవి అక్షయాలు అవుతాయని మహాఋషులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఈ నెలరోజులు చేసే పుణ్యకార్యాలను కార్తీకవ్రతం అంటున్నారు. కార్తీక వ్రతమునునే తులాసంక్రమణము మొదలుకొని గానీ, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుగాని ఆరంభించాలి.
ముందుగా కార్తీక వ్రతం స్నానవిధితో మొదలు అవుతుంది. ఈ స్నానం సంకల్పంతో ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని, భగవంతునికి ముఖ్యంగా సూర్యునికి నమస్కరించి, స్నానం చెయ్యాలి.
నిత్యం ఇలా చేయండి…
1. కార్తీకమాసంలో ప్రతివారు ఉదయం స్నానం, భగవంతుని దర్శనం అయిన తరువాత ఉదయం ఇంటివద్దగల తులసి చెట్టువద్ద దీపారాధన చేసి తులసిపూజ చేయాలి.
2. సాయంకాలం నక్షత్ర దర్శనం కాగానే దీపం వెలిగించి ఒకటి తులసి చెట్టు దగ్గర మరొక దీపం గుమ్మం ప్రక్కన ఉంచాలి.
3. కార్తీక పురాణం చదివినంతసేపు దీపారాధన దేవుని వద్ద వెలుగుతూ ఉండాలి.
4. సంవత్సరంలోని ఏ నెలలోనైనా ద్వాదశినాడు తులసి దళములను కోయకూడదు.
5. కార్తీక మాసంలో ఏ తిథిలో కూడా ఉసిరిక ఆకులను కోయరాదు.
6. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టువద్ద లేక క్రింద విష్ణుపూజ చేసినవారు సమస్త క్షేత్రములలో విష్ణుపూజ చేసిన వారు అవుతారు
7. కార్తీకమాసంలో ప్రతిసోమవారం అవకాశం ఉన్నంత వరకు సోమవార వ్రతం ఆచరించటం ఉత్తమం.
కార్తీక మహత్యం ఇదే…
కార్తీక మహాత్మ్యమును పూర్వం వసిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. దీనివలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షము నొందును అని చెప్పెను. ఆయన ఆ మునులతో ఇంకను ఇట్లు చెప్పెను.
ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు పోవుచున్న వసిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను.
అంతట జనక మహారాజు వచ్చిన వసిష్ఠుని చూచి, సింహాసనము నుంచి త్వరగా దిగి దండప్రణామముచేసి సంతోషము చేత పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సునందు ఉంచుకొనెను. బంగారపు ఆసనము ఇచ్చి వికసించిన తామర పువ్వులవంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులందును దయగల వాడును, అంతరింద్రియ బహిరింద్రియ విగ్రహము కలవాడును, సదాచారవంతుడును, బాలసూర్య సమాన కాంతి కలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునితో భక్తితో ఇట్లని విన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! విదర్శనము వల్ల నేను ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యము ఇంకేమియు లేదు. ఇప్పుడు మా పితరులు అందరు తృప్తి చెందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీరు మా ఇంటికి రావటమువల్ల నాకు శుభములు చేకూరును అని రాజు పలికెను.
జనక రాజిట్లు పలికిన తరువాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయకలిగినవాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచు రాజుతో ఇట్లు పలికెను.
రాజోత్తమా! నీకు క్షేమమగు గాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞము జరగవలెను. దానికిప్పుడు అవసరమైన ద్రవ్యమును సమకూర్చుటకు నీవే అర్హుడవు అని చెప్పగా… అంతట.
రాజు : మునీశ్వరా ! యజ్ఞమునకు చాలా ద్రవ్యమును సమకూర్చెదను కాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యమును నీ వలన వినకోరుచున్నాను. నీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము నిచ్చెడి సూక్ష్మధర్మమును నాకు చెప్పుము.
గొప్ప విజ్ఞాననముగల మునీశ్వరా! కార్తిక మాసము సమస్త మాసముల కంటెను. సమస్త ధర్మములకంటెను ఎట్లు అధికమైనదో దానిని వినకోరుచున్నాను. నాకు తెల్పుము. నీ కంటె ధర్మమును గురించి ఎక్కువ తెలిసినవారులేరు. అడుగగా,
వశిష్ఠుడు : రాజా! ముందు జన్మలో పుణ్యమాచరించిన ఎడల సత్వశుద్ధి గలుగును సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. కనుక లోకోపకారార్ధమై ఇప్పుడు నీవు అడిగినమాట చాలా బాగున్నది. వినువారికి పాపమును శమింపచేయుటకు దానిని చెప్పెదను వినుము అని వశిష్ఠుడు చెప్పెను.
రాజా ! సూర్యుడు తులా సంక్రమణమునందు ఉండగా కార్తిక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి, మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి.
కార్తిక వ్రతమును తులా సంక్రమణము మొదలుకొనిగాని కార్తిక శుక్ల పాడ్యమి. మొదలుకొని గాని ఆరంభించవలెను. ఆరంభమందు…
ఓ దామోదారా ! నేను కార్తిక వ్రతమును ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము. అని సంకల్పము చేసి కార్తిక స్నానము ఆరంభింపవలెను.
కార్తీక మహాపురాణము
కార్తికమాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానము అచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులా రాశిని ప్రవేశించిన వెంటనే మూడు లోకములను పవిత్రము చేయుచు గంగానది ద్రవరూపమును ధరించి సమస్త నదీజలముల యందును ప్రవేశించును. తులారాశిలో కార్తికమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, పిల్లకాలువలందును హరి నివసించి ఉందును.
రాజా ! అన్ని అన్నివర్ణాలవారు అన్ని వర్గముల వారు కార్తికమందు ఈ ఆచారమును పాటించవలెను. బ్రాహణుడు కార్తిక మాసమందు గంగకు పోయి సమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనముచేసి శుధ్ధుడై మంత్రములచేత భైరవ అనుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృ తర్పణము ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠింపుచు, బొటనవేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి మొలవస్త్రమును విడిచి ఉదకమును వదలి ఆచమనముచేసి శిరస్సును వదలి మిగిలిన శరీరము అంతయు తడి వస్త్రముతో తుడిచికొని నారాయణ ధ్యానము ఆచరింపుచు దౌత వస్త్రమును ధరించవలెను.
అటు తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో తగినన్ని మారులు త్రి పుండ్రము లను లేక విభూతిని ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీ జపము చేయవలెను.
తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞముచేసి తనతోటలోనుంచి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోప చారములతో పూజించవలెను.
తరువాత కార్తికపురాణము పఠించి (లేక) విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి తరువాత వైశ్వదేవమును నెరవేర్చి, భోజనముచేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును జేయవలయును.
సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములను అన్నింటిని ఆపివేసి విష్ణాలయ మందుగాని, శివాలయమందుగాని తనశక్తి కొలది దీపములను బెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాకుృద్ధితో విష్ణు స్తోత్రమునుగాని, శివ స్తోత్రమునుగాని పఠించి నమస్కారములు అర్పించవలయును.
కార్తికమాసమందు ఎవరు ఈ ప్రకారము భక్తితో చేయునో వారు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుదురు. కార్తికపత్ర మాచరించినయెడల పూర్వ జన్యార్థిత ములున్నూ ఈ జన్మార్జితము లున్ను అయిన సమస్త పాపములు నశించును. బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడు గాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తి వ్రతమును చేసిన యెడల వారికి పునర్జన్మము ఉండదు.
శ్లో॥ కార్తికే ధర్మనిరతం దృష్ట్వా మోదతి యఃపుమాన్ | తద్దినాఘనివృత్తిస్స్యా న్నాత్రకార్యావిచారణా ॥
ఎవరు కార్తిక వ్రతమును ఆచరించు వానిని చూచి సంతోషించునో, అతడు ఆదినమందు ఆచరించిన పాతకము నశించును.
టాపిక్