Best Web Hosting Provider In India 2024
అసలు జీవితం అంటే ఏమిటి? దాని నిర్వచనం ఎవరైనా చెప్పగలరా? జీవితంలో ఆనందం, సుఖం మాత్రమే ఉంటాయని ఏ పురాణాల్లోనైనా చెప్పారా? జీవితం అంటే సుఖదుఃఖాలు అని ఏనాడో అన్నారు పెద్దలు. కానీ దుఃఖాన్ని తీసుకోవడానికి అడ్డంకులను ఎదుర్కోవడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా ఉండరు. జీవితం అంటేనే పూలు, ముళ్ళు, రాళ్ళు అన్ని కలిసినదే. మీరు పూలను ఎలా స్వీకరిస్తారో… రాళ్లు ముళ్ళను కూడా అలాగే తట్టుకునే నిలబడాలి.
బురద నీటి నుంచి కమలాలు ఉద్భవిస్తాయి. బురదకు భయపడి తామర మొక్క పెరగడమే మానేస్తే అందమైన కమల పువ్వులు ఎలా పుట్టుకొస్తాయి? కన్నీళ్లు, కల్లోలాలు అన్నీ జీవితంలో భాగమే. ఆనందాన్ని, ఆర్థిక లాభాలను ఎలా స్వీకరిస్తారో అలాగే వీటిని స్వీకరించి తట్టుకుని నిలబడే శక్తిని పెంచుకోండి.
మీరు నడుస్తున్న దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే అక్కడే నడక ఆపేయరు కదా, ముళ్ళు తీసుకొని తిరిగి నడక ప్రారంభిస్తారు. అలాగే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మీ ప్రయాణాన్ని ఆపకూడదు. భగవంతుడు జీవితంలో సంతోషాన్ని, సౌందర్యాన్ని మాత్రమే కాదు… ఆ జీవితం విలువ తెలిపేందుకే కన్నీళ్ళను, కష్టాలను కూడా ఇచ్చాడు. ఇది ఉన్నప్పుడే మీకు సంతోషం విలువ తెలుస్తుంది.
కొంతమంది రాబోయే ఆటంకాలను కూడా ముందే ఊహించుకొని భయపడిపోతూ అడుగు ముందుకు వేయరు. అలాంటి వారికి జీవితం అక్కడే ఆగిపోతుంది, ఏది సాధించలేరు. జీవితమంటేనే స్నేక్ అండ్ లేడర్స్ ఆట లాంటిది. నిచ్చెనలే కాదు మింగేసే పాములు కూడా ఉంటాయి. నిచ్చెనలు మాత్రమే కావాలి, పాములు వద్దంటే కుదరదు. జీవించాలంటే అన్నింటినీ స్వీకరించాల్సిందే.
దీపాల చుట్టూ చేరే పురుగుల్ని చూడండి. తమ రెక్కలు కాలిపోతాయని, తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆ పురుగులు ఆ దీపం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అలా తిరగడమే వాటి జీవితం. కేవలం కొన్ని గంటల ఆయుష్షు మాత్రమే ఉన్న పురుగే అంత ధైర్యంగా దీపం చుట్టూ తిరుగుతూ ఉంటే… వంద ఏళ్ళు ఉన్న మనిషి మాత్రం చిన్న కష్టానికి భయపడిపోతాడు. జీవితంలో యుద్ధం ఎదురైనా కూడా…ఆ యుద్ధం చేసేందుకు సిద్ధమవ్వాలి. యుద్ధంలో గెలుస్తామా లేదా అన్నది తర్వాత విషయం… యుద్ధం చేసామా లేదా అన్నది ముఖ్యం. మీ జీవితాన్ని మీరు సార్ధకం చేసుకోవాలంటే మొదటే ఓడిపోకూడదు, యుద్ధం చేశాకే ఓడిపోవాలి. ఆ యుద్ధంలో గెలుపును పొందవచ్చు లేదా ఓటమి ఎదురవచ్చు… ఏదైనా కూడా గెలుపుతోనే సమానం. ప్రయాణం ప్రయత్నం చేయకుండా ఆగిపోతే మీరు గెలిచినా ఓడినట్టే .
సమస్యలకు భయపడడం మానేయండి. భవిష్యత్తు బావుండాలని మాత్రం కోరుకోండి. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. జీవితం మీకే కాదు ప్రతి జీవికి సవాలే. మీ ఒక్కరికే కష్టాలు వస్తున్నాయి అనుకోకండి… ఈ భూమిపై పుట్టిన చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవులకూ ఏదో ఒక కష్టం వస్తుంది. వాటిని తట్టుకునేందుకు కావాల్సింది మనోనిబ్బరమే. దాన్ని తెచ్చుకోండి చాలు, మీ జీవితం అలా సాగిపోతూనే ఉంటుంది.