Best Web Hosting Provider In India 2024
YCP Saireddy: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న డిజిటల్ ప్రచారాలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వారం రోజుల వ్యవధిలో వందమందిపై కేసులు నమోదు చేశారు. ట్రోల్ ముఠాలను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రెండు రోజుల్లో 100 మందిని అరెస్టు చేశారని మండిపడ్డారు.
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని, రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తప్పు పడుతూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్ ను కాటేస్తాయని, చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు.
అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంగించి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.
వైయస్సార్సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, వారికి అండగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను కూటమిలో ద్వితీయ శ్రేణి పౌరునిగా చూస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు.
అధికారంలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ కాళ్లు లోకేష్ పట్టుకున్నారని ఎద్దేవా చేసిన సాయిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినోద్దు అంటూ అధికారులకు లోకేష్ చెబుతున్నారని ఆరోపించారు.
లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ ను, కాపు జాతిని చంద్రబాబు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. పవన్ పై మందకృష్ణ మాదిగ విమర్శలు చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం అన్నారు. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తొక్కు పెడుతున్నారని విమర్శించారు. లోకేష ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్ ను ప్రణాళిక బద్ధంగా తొక్కి పెడుతున్నారన్నారు.
ఋషికొండ అద్భుతమైన కట్టడం అని, ఆ భవనం రాష్ట్రానికి తలమానికం అని సాయిరెడ్డి ప్రశంసించారు. ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయని సాయిరెడ్డి జోశ్యం చెప్పారు. 2027 తర్వాత తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తల అరెస్టులపై న్యాయపోరాటం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.
దూకుడు పెంచిన టీడీపీ…
సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, మహిళలు, ముఖ‌్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత ఐదేళ్లుగా టీడీపీ ముఖ్య నాయకుల్ని ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఖాతాలను మూసేసి మాయమైనా వారి పాత పోస్టుల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. నిందితులపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారి అసలు ముఖాలను బహిర్గతం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి వారి అసలు పేర్లు, వివరాలను, వారిపై నమోదైన కేసుల జాబితాలను బహిరంగంగా ఉంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహిళా మంత్రులు, ముఖ్యమైన నాయకుల్ని అసభ్యంగా దూషిస్తున్న పలువురిని సైబర్ బృందాలు గుర్తించాయి. వారందరి అసలు పేర్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టాపిక్