Best Web Hosting Provider In India 2024
ఆడవాళ్లకు ఆరు గజాల చీర ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. అయితే ప్రతిరోజూ చీర కట్టుకునేవారికి చీర క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే భయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయం అపోహగానే భావించేవారు ఉన్నారు. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం చీర క్యాన్సర్ లేదా శారీ క్యాన్సర్ అనేది నిజంగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దర్శన రాణే హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చీర క్యాన్సర్ అని పిలిచే అరుదైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిరోజూ చీరలు ధరించే మహిళలను ఇది ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇది నడుము చుట్టు ఎక్కడైనా రావొచ్చని చెప్పారు. ఇదొక రకమైన చర్మం క్యాన్సర్ గానే చెప్పుకోవాలన్నారు. చీర లోపల వేసుకునే పెటికోట్ నాడాను గట్టిగా నడుముకు కట్టుకుంటారు. ఇలా కట్టడం వల్ల దీర్ఘకాలికంగా చికాకు కలుగుతుంది.
‘చీర క్యాన్సర్’కు కారణమేమిటి?
చీర క్యాన్సర్ ను ‘పెటికోట్ క్యాన్సర్’ అని కూడా పిలుస్తారు. పెటికోట్ (చీర లోపల ధరించే లంగా) నాడాను నడుముపై చాలా గట్టిగా కట్టడం వల్ల వస్తుంది. ఈ తాడును ప్రతిరోజూ నడుముకు బిగించి ఉంచడం వల్ల అక్కడ ఉన్న చర్మానికి చికాకుగా మారుతుంది దారితీస్తుంది. ఇది అల్సర్లుగా మారుతుంది, దీనిని మార్జోలిన్ అల్సర్ అని కూడా పిలుస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో, ప్రాణాంతకం కావచ్చు.
‘చీర క్యాన్సర్’ ప్రారంభ సంకేతాలు
పెటికోట్ నాడా చర్మానికి చికాకు కలిగిస్తుంది. భారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, ఈ పరిస్థితి దిగజారిపోతుంది.
భారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండవు. గ్రామీణ ప్రాంతాలలో పెటికోట్ వేసుకునే మహిళలకు ఈ చికాకు ఎక్కువైపోతుంది. పెటికోట్ కట్టిన తాడు చుట్టూ చెమట, దుమ్ము పేరుకుపోతుంది. దీనివల్ల దురద ఎక్కువైపోతుంది. అక్కడ ఎక్కువ గోకడం వంటివి చేస్తారు. ఇది అక్కడ చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అలా చర్మ సమస్యలు మొదలైనప్పుడే వైద్యుల సాయం తీసుకోవాలి. లేకుంటే అది క్యాన్సర్ గా మారిపోవచ్చు.
చీరలే కాదు ఇవి కూడా
చుడీదార్లు వేసుకునే మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. వారు కూడా ప్యాంటుకు ఉండే తాడును నడుము చుట్టూ గట్టిగానే కడతారు. అలాగే ధోతీలు ధరించే పురుషులలో కూడా ఇలాంటి చర్మ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
◉ చాలా బిగుతుగా ప్యాంట్లు, పెటికోట్లు కట్టడం మానుకోండి, ప్రత్యేకించి మీరు పిగ్మెంటేషన్ మార్పులు లేదా మచ్చలు వంటి లక్షణాలు కనిపించే జాగ్రత్తగా ఉండండి.
◉ పెటికోట్ కు వాడే నాడా తాడులాగా ఉండేది కాకుండా పట్టీలాగా ఉండేది ఎంచుకోవాలి. ఇది చర్మంపై ఒత్తిడి తగ్గిస్తుంది.
◉ ఇంట్లో ఉన్నప్పుడు బిగుతుగా పెట్టికోట్ కట్టుకోవడం మానేయండి. కాస్త వదులుగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు చీరలు మాని నైటీల్లాంటివి వేసుకుంటే చీర క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
◉ నడుము ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా అవసరం, ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారికి దుమ్ము, చెమట పేరుకుపోతుంది. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.