Best Web Hosting Provider In India 2024
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యం కానుంది. విద్యాశాఖ ముందుగా వెల్లడించిన వివరాల ప్రకారం… నవంబర్ 5 నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే సమయంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల రీత్యా… దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేసినట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది.
సాంకేతిక కారణాల రీత్యా నవంబర్ 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది. అయితే ఇవాళ రాత్రి వరకు కూడా వెబ్ సైట్ అందుబాటులోకి రాలేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ షురూ కాలేదు. అంతేకాకుండా పూర్తిస్థాయి నోటిఫికేషన్ కూడా వెబ్ సైట్ లో అందుబాటులో లేదు. మరోవైపు విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
నవంబర్ 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ చెప్పిన నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు వెబ్ సైట్ ను సందర్శిస్తున్నారు. కానీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో అభ్యర్థులు టెట్ దరఖాస్తుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రేపు(శుక్రవారం) లేదా ఎల్లుండి నుంచి టెట్ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 20వ తేదీ వరకు టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెట్ విద్యార్హతలు, సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులు, అర్హతల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా మార్చే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ పరీక్షలను జనవరి 1-20 తేదీల మధ్య నిర్వహిస్తారు. మార్చిలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండటంతో జనవరిలోనే టెట్ పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ను కూడా గతంలోనే విడుదల చేసింది.
టెట్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయిన నోటిఫికేషన్ విడుదలలో పేర్కొన్నారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20% వెయిటేజ్ ఇస్తారు.
సంబంధిత కథనం
టాపిక్