Best Web Hosting Provider In India 2024
Jithendar Reddy Review: బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటించిన మూవీ జితేందర్‌రెడ్డి. బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విరించి వర్మ దర్శకత్వం వహించాడు. రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
జితేందర్ రెడ్డి జీవితం…
జితేందర్‌రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, భావజాలానికి ఆకర్షితుడవుతాడు. అతడి కుటుంబం ప్రజాల పక్షాన నిలుస్తూ సమస్యలపై పోరాటం చేస్తుంటుంది. జితేందర్‌రెడ్డి కూడా వారి బాటలోనే అడుగులువేస్తుంటాడు. దేశానికి, ప్రజలకు మంచి చేయాలని అనుక్షణం తపిస్తుంటాడు.
కాలేజీలో విద్యార్థి నాయకుడిగా స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలపై పోరాటం చేస్తుంటాడు. బూటకపు ఎన్‌కౌంటర్ కారణంగా నక్సలిజం ఉద్యమంపై జితేందర్‌రెడ్డికి ఉన్న మంచి అభిప్రాయం పూర్తిగా తొలగిపోతుంది. నక్సలిజం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని నమ్ముతాడు. నక్సలిజంలోకి వెళ్లొద్దని పిలులునిచ్చి నక్సలైట్లకు టార్గెట్‌గా మారిపోతాడు.
ఈ పోరాటంలో జితేందర్‌రెడ్డికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? జితేందర్‌రెడ్డికి లాయర్ శారదకు (రియా సుమన్) ఉన్న సంబంధం ఏమిటి? ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జితేందర్‌రెడ్డి ఎందుకు అనుకున్నాడు? ఎన్టీఆర్‌ను కలవడానికి కారణం ఏమిటి? చివరకు నక్సలైట్ల చేతుల్లోనే జితేందర్‌రెడ్డి ఎలా చనిపోయాడు అన్నదే ఈ మూవీ కథ.
బయోపిక్ సినిమాల ట్రెండ్…
టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచానికి తెలియని చరిత్రలో మరుగున పడిన వ్యక్తుల జీవితాలను వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తోన్నారు. జితేందర్‌రెడ్డి అలాంటి సినిమానే.
1980 – 90 కథ…
నక్సలిజం ఉద్యమం తెలంగాణలో బలంగా ఉన్న రోజుల్లో 1980 -90 దశకంలో జగిత్యాలకు చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. జితేందర్‌రెడ్డిని నక్సలైట్లు చంపడానికి ముందు ఏం జరిగిందన్నది? అప్పటి తెలంగాణ సామాజిక జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
మరో కోణం…
నక్సలిజం ఉద్యమంలోని మరో కోణాన్ని జితేందర్‌రెడ్డి బయోపిక్ ద్వారా ఈ మూవీలో ఆవిష్కరించారు డైరెక్టర్. బస్సులను తగలబెట్టడం, బ్రిడ్జ్‌లను రోడ్లను పేల్చేయటం లాంటి పనులతో అభివృద్ధిని అడ్డుకున్నారంటూ చూపించారు. జితేందర్‌రెడ్డిని హీరోగా…కంప్లీట్‌గా పాజిటివ్ కోణంలోనే చూపించాలనే లక్ష్యంతో చేసిన ఈ మూవీ. అందుకు తగ్గట్లే కథ, కథనాలు సాగుతాయి. కొంత సినిమాటిక్ లిబర్జీ తీసుకున్నట్లుగా ఈజీగా తెలిసిపోతుంది.
క్లైమాక్స్…
నక్సలైట్లకు ఎదురొడ్డి జితేందర్ రెడ్డి సాగించిన జర్నీతో పాటు అప్పట్లో పీడీఎస్‌యు, ఏబీవీపీ లాంటి స్టూడెంట్స్ యూనియన్స్ ఎలా పనిచేశాయన్నది టచ్ చేశారు. ఎన్టీఆర్, వాజ్‌పాయి లాంటి నాయకుల ప్రస్తావన కథలో చర్చించారు. ఆ సీన్స్ బాగున్నాయి. జితేందర్ రెడ్డి నక్సలైట్లు దారుణంగా ఎలా చంపారన్నది క్లైమాక్స్‌లో కళ్లకు కట్టినట్లుగా ప్రజెంట్ చేశారు. పాతకాలం నాటి వార్త పత్రికల క థనాల్ని చూపించడం బాగుంది.
ఫిక్షనల్ బయోపిక్…
జితేందర్ రెడ్డి బయోపిక్‌ను కమర్షియల్ హంగులతో చెప్పాలనే తాపత్రయంలో దర్శకుడు ఫిక్షనల్ అంశాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.
జితేందర్ రెడ్డిగా…
జితేందర్‌రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే యాక్టింగ్ బాగుంది. పాత్రకు తనదైన శైలిలో న్యాయం చేసేందుకు కష్టపడ్డాడు. ఆర్ఎస్ఎస్ లీడర్‌గా సుబ్బరాజు, నక్సలైట్ నాయకుడిగా ఛత్రపతి శేఖర్ నటనానుభవం ఈ సినిమాకు ప్లస్సయింది. రియా సుమన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
బయోపిక్ లవర్స్‌కు…
బయోపిక్ మూవీస్‌ను ఇష్టపడేవారిని జితేందర్‌రెడ్డి కొంత వరకు మెప్పిస్తుంది. జితేందర్ రెడ్డి తో పాటు నక్సలిజం ఉద్యమం గురించి తెలిసిన వారికి ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 2.75/5