Best Web Hosting Provider In India 2024
AP Women Swimming Record : వైజాగ్ నుండి కాకినాడ వరకు.. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదిన 52 ఏళ్ల మహిళ
AP Women Swimming Record : రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన రికార్డ్ సాధించారు. సముద్రంలో ఏకంగా 150 కిలో మీటర్లు ఈదారు. ఆమె వయస్సు 52 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈ వయస్సులో కూడా ఇంత సాహసం చేయడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట్కు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల.. అరుదైన ఘనత సాధించారు. విశాఖపట్నం నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం.. డిసెంబర్ 28న వైజాగ్‌లోని ఆర్.కె. బీచ్‌లో ప్రారంభమైంది. జనవరి 1న కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో ముగిసింది. శ్యామల రోజుకు సగటున 30 కిలోమీటర్లు ఈదింది.
నిరాశ నుంచి..
శ్యామల దశాబ్దానికి పైగా నిర్మాతగా, సృజనాత్మక దర్శకురాలిగా, రచయితగా పనిచేసింది. కానీ. తన యానిమేషన్ స్టూడియోను మూసివేసిన నిరాశలో కూరుకుపోయింది. దాన్నుంచి బయటకు రావడానికి ఈతను ఒక మార్గంగా ఎంచుకుంది. ఈతను అభిరుచిగా మార్చుకుంది. పట్టు సాధించాక.. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఈతలో ప్రజలను ప్రోత్సహిస్తోంది.
శ్యామల విజయాలు..
పాల్క్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈది, ఈ ఘనత సాధించిన రెండో మహిళ శ్యామల.
కాటాలినా ఛానల్: 12 డిగ్రీల ఉష్ణోగ్రతలలో 19 గంటల్లో కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు ప్రయాణించింది.
లక్షద్వీప్ దీవులు: లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నుండి ప్రేరణ పొంది.. కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపం వరకు 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదింది.
నదుల్లోనూ..
శ్యామల కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్లు, హూగ్లీ నదిలో 14 కిలోమీటర్లు, గంగా నదిలో 13 కిలోమీటర్లు, భాగీరథి నది 81 కిలోమీటర్లు ఈదింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా శ్యామల ఈ ప్రతిష్టాత్మక 150 కిలోమీటర్ల ఈతను ప్రారంభించింది. ఈదే సమయంలో ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించడానికి.. 12 మంది సభ్యుల బృందం శ్యామలతో పాటు వెళ్లింది. వీరిలో పరిశీలకులు, ఒక వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు, కయాకర్లు ఉన్నారు. వీరు రెండు పెద్ద పడవలు, ఒక చిన్న పడవలో శ్యామల వెంట వెళ్లారు.
టాపిక్