Best Web Hosting Provider In India 2024
కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూటి ప్రశ్న
సూపర్ సిక్స్‌లో అమలు చేసిన ఈ ఒక్క హామీకి తూట్లే
పెన్షన్ పెంచినట్లే పెంచి, లబ్ధిదారుల్లో కోతలు మొదలు
రీవెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారులపై వేధింపులు ఆపాలి
రాజకీయ కక్షతో పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదు
వారికి అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయిస్తాం
ప్రెస్మీట్లో సుధాకర్‌బాబు స్పష్టీకరణ
తాడేపల్లి: రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికీ పంపి పింఛన్ లబ్దిదారుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే 3.5 లక్షల పెన్షన్లు తొలగించారని వెల్లడించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊర్కోబోమని.. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
పెన్షన్ లబ్ధిదారులపై పగ!:
– దివ్యాంగులు, దురదృష్టవశాత్తు ప్రమాదమో, అనారోగ్యంతోనో బాధపడే వారిని జాలి, దయతో పింఛన్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పింఛన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారిపై పగ సాధిస్తున్నట్లుగా ఉంది.
– అర్హతే ప్రామాణికంగా గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేం పింఛన్లు అందజేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ జన్మభూమి కమిటీల ద్వారా అందించే పాత విధానానికి కొత్త సంవత్సరంలో ప్రారంభించడం దారుణం.
– ఇప్పటికే 3,53,227 మంది పింఛన్లు కోల్పోగా, ఇప్పుడు దివ్యాంగులు, అనారోగ్యంతో బాధ పడుతున్న పెన్షనర్లను టార్గెట్ చేశారు. అందుకే కొత్తగా రీవెరిఫికేషన్ మొదలు పెట్టారు.
ఎక్కడి 39 లక్షలు? ఎక్కడి 66 లక్షలు. ఎంత తేడా!:
– వైయస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నెలకు 66,34,742 పింఛన్లు పంపిణీ చేసింది. ఆ 5 ఏళ్లలో పెన్షన్ల కింద రూ.92,547.66 కోట్లు ఠంచన్‌గా ఒకటో తేదీ రోజున తెల్లవారకముందే డోర్ డెలివరీ చేశాం.
– 2019లో చంద్రబాబు దిగిపోయి వైయస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఇంచుమించుగా 39 లక్షల పింఛన్లు ఉండగా 2024లో జగన్ దిగిపోయే నాటికి ఆ సంఖ్య 66 లక్షలకు పెరిగింది.
– వాటిలో ఈ ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం 3.5 లక్షల పెన్షన్లు తగ్గించింది.
– ఇప్పుడు దివ్యాంగులు, అనారోగ్యంతో బాధ పడుతున్న పింఛన్ లబ్ధిదారుల రీవెరిఫికేషన్ చేపట్టి, వాటిలో కోతకు సిద్ధమవుతోంది.
– చంద్రబాబు ఉన్న పింఛన్లు తొలగించడానికి మెకానిజం ఏర్పాటు చేసుకుంటుంటే, జగన్ మాత్రం వీలైనంత ఎక్కువ మందిని లబ్ధిదారులుగా చేర్చి వారికి అండగా నిలిచేందుకు మనస్ఫూర్తిగా కృషి చేశారు.
– అందుకే పెన్షన్‌కు అర్హతలో నియమాలు సడలించడంతో పాటు, వయస్సు కూడా 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. అలాగే ఆదాయ పరిమితిని రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఇంకా భూపరిమితి 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాలకు పెంచారు.
– 12 కేటగిరీల్లోనే నాడు చంద్రబాబు పింఛన్లు ఇవ్వగా, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య కేటగిరీలో కూడా పింఛన్లు అందజేసి ఆదుకున్నారు.
– గతంలో పింఛన్లు ఒకటి లేక రెండుసార్లు మాత్రమే కొత్త పింఛన్లు ఇవ్వగా, జగన్ హయాంలో దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి పింఛన్ అందించే విధానానికి శ్రీకారం చుట్టారు.
– కొత్త పింఛన్లు సాధించుకోవాలంటే లంచం ఇవ్వాల్సిన పని లేదు, జన్మభూమి కమిటీల సిఫార్సులు అవసరం లేదు, ఎవరి సానుభూతి చూపనవసరం లేకుండానే, దరఖాస్తు చేసుకుంటే చాలు అర్హతే ప్రామాణికంగా పింఛన్లు అందజేసిన ఘనత వైఎస్ జగన్‌ది.
పింఛన్లు తొలగించడానికి వైద్య బృందాలా?:
– మా హయాంలో కోవిడ్ గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు చంద్రబాబు పెన్షన్లు తొలగించడానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తున్నారు.
– నాడు సచివాలయ పరిధిలో ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవస్థను, చంద్రబాబు డాక్టర్ల చేతికిస్తున్నాడు. రీవెరిఫికేషన్లో ఎవరైనా పింఛన్లు కోల్పోతే వారికి సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా శిక్షిస్తారా?. అది ఒక రకంగా, ఇకపై డాక్టర్లు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పరోక్షంగా బెదిరించడం కాదా..?
– రాజకీయ కోణంలో ఒక్క పింఛన్ తొలగించినా లబ్ధిదారుల తరఫున హైకోర్టును ఆశ్రయిస్తాం. అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు రీవెరిఫికేషన్లో నష్టం జరిగితే అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని టీజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు.