Best Web Hosting Provider In India 2024
TG Govt On HMPV : హెచ్ఎంపీవీ వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన-పాటించాల్సిన జాగ్రత్తలివే
TG Govt On HMPV : చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ కేసులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేదని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, పలు సూచనలు చేసింది.
TG Govt On HMPV : చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(HMPV) వైరస్ విజృంభిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ మరో కరోనాలా మారే అవకాశం ఉండడంతో ఇతర దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారత్ లో కొత్త వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్న వారు మాస్క్ ధరించాలని సూచించింది. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని తెలిపింది.
తెలంగాణలో కేసులు లేవు
హెచ్ఎంపీవీ సాధారణ శ్వాసకోశ వైరస్… శీతాకాలంలో సాధారణ జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటుందని వైద్యులు అంటున్నారు. పిల్లలు, వృద్ధుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణలో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం కలిగి ఉందని, పరిస్థితిని నిశితంగా గమనిస్తుందన్నారు. డిసెంబర్ నెలలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సమాచారం విశ్లేషించామని, 2023తో పోల్చితే కేసులు పెరిగినట్లు గమనించామన్నారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లపై ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
పాటించాల్సిన జాగ్రత్తలు
హెచ్ఎంపీవీని తొలిసారిగా 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు దారి తీయవచ్చు. వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, వారిని తాకినప్పుడు వైరస్ సోకే అవకాశం ఉంది. వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, ఆ చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినప్పుడు వైరస్ వ్యాపిస్తుంది.
హెచ్ఎంపీవీ వైరల్ సోకకుండా తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని తాకకూడదు. జలుబు, దగ్గు వంటి అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు, నోటికి అడ్డంగా కర్చీఫ్‌ను పెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వకూడదు. అస్వస్థత ఉంటే ఇంట్లోనే ఉండి ఇతరులకు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం నిద్రపోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్