Best Web Hosting Provider In India 2024
CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్‌వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం- సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధాని, రాబోయే రోజుల్లో విశాఖ మేటైన నగరంగా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పర్యాటక రాజధానిగా విశాఖను మార్చుతామన్నారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు.
CM Chandrababu : దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుపాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నేవీ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్ స్థావరానికి పునాది పడిందని, అధికారికంగా తూర్పు నౌకాదళం 1983లో ఏర్పాటైందన్నారు. చిన్న నేవల్ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్ ఇవాళ మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నేవీ విన్యాసాలను సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ బాబుతో కలిసి తిలకించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మదిని మైమరపించేలా నేవీ అద్భుత విన్యాసాలను చేసిందన్నారు. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్ అడ్మినల్ నిర్ణయించడం చాలా సంతోషకరం అన్నారు. ఎంత క్రమశిక్షణ, కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడం సాధ్యం అవుతుందన్నారు. 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్ కమాండ్ చాలా కీలకంగా పని చేసిందన్నారు. పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీని ధ్వంసం చేసింది మన విశాఖ తూర్పు నౌకాదళమేనని గుర్తుచేశారు. ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచిందన్నారు. కలకత్తా నుంచి చెన్నై వరకు కోస్టల్ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
హుద్‌హుద్ సమయంలో నేవీ చొరవ మర్చిపోలేము
2014లో వచ్చిన హుద్‌హుద్ సమయంలో తాను 10 రోజుల పాటు విశాఖలోనే ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో నేవీ చూపిన చొరవ తన జీవితంలో మరచిపోలేనన్నారు. తుపాన్ సమయంలో మత్య్సకారుల ప్రాణాలు కూడా కాపాడుతున్నారన్నారు. దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా ముందుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని, దీనికి నావికాదళం కూడా పని చేస్తోందన్నారు. తూర్పు కోస్ట్‌లో ఉన్న అనేక పోర్టులను పరిరక్షించే బాధ్యత నావికా దళం తీసుకుందన్నారు. తూర్పు నౌకాదళం మన దగ్గర ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విశాఖ వాసులు చూపించే అభిమానం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. విశాఖ అంటేనే ప్రశాంతత, ఇక్కడి ప్రజలు అంటేనే మంచితనం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరు అని సీఎం కొనియాడారు.
పర్యాటక రాజధానిగా విశాఖ
‘మన దేశానికి ముంబయి ఎలా ఆర్థిక రాజధానో.. ఏపీకి విశాఖపట్నం కూడా ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖ మేటైన నగరంగా తయారవుతుంది. పర్యాటక రాజధానిగా విశాఖను మార్చుతాం. పోర్టులు ఉన్నాయి, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. అతిపెద్దదైన గంగవరం పోర్టు ఉంది. మరో ఏడాదిలో భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుంది. మెట్రోరైల్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం. రాష్ట్రాన్ని మారిటైం గేట్‌వేగా తయారు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. గూగుల్ తన డేటా సెంటర్‌ను విశాఖలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇంకా మరికొన్ని ఐటీ కంపెలు తమ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నెల 8న ప్రధాన మంత్రి మోదీ విశాఖపట్నం వచ్చి రైల్వేజోన్‌కు శంకుస్థాన చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ మొదటి ప్రాజెక్టు కింద ఎన్టీపీసీ-ఏపీజెన్‌కో జాయింట్ వెంచర్ వేస్తున్నాయి. దీనికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. గోదావరి నీళ్లు ఈ ఏడాది అనకాపల్లికి, వచ్చే ఏడాది విశాఖపట్నానికి తీసుకొస్తాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
నాలెడ్జ్ సిటీగా విశాఖ
‘విశాఖను నాలెడ్జ్ సిటీగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నాం. నేవీ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తే విశాఖ నుంచే ఎక్కువ మంది ఎంపికవుతున్నారు. అరకు కాఫీని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తున్నాం. అతిపెద్ద ఆకర్షణగా ఉన్న కురుసర సబ్ మెరైన్ మ్యూజియం కూడా 2002లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. 2017లో రూ.14 కోట్లతో టీయూ142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఏర్పాటు చేసుకున్నాం. విశాఖను ఆర్థిక, టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు పని చేస్తున్నాం. వికసిత్ భారత్ లో భాగంగా ప్రధాని మోదీ డిఫెన్స్ రంగంలోనూ అభివృద్ధి సాధించేందుకు ముందుకెళ్లారు.
దేశం ఆర్థికంగా దూసుకెళ్తోంది. డిఫెన్స్ రంగంలో సమర్థవంతంగా ఉండేందుకు నేవీ చేస్తున్న కృషి అసామాన్యం. మన దేశ నేవీని చూస్తే ఇతర దేశాలు భయపడుతున్నాయి. ప్రాణాలు లెక్కపెట్టకుండా దేశం కోసం పోరాడే నేవీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాష్ట్రంలో సుమారు వెయ్యి కి.మీ కోస్టల్ లైన్ ఉంది. మౌళిక సదుపాయాలు కల్పిస్తే మన యువతకు ఉపాధి, సంపద సృష్టికి ఉపయోగపడుతుంది. దేశ భవిష్యత్తును రక్షించేందుకు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఆర్థికాభివృద్ధికి కూడా నేవీ ముందుకు రావాలని కోరుతున్నా. ఏఐ, డ్రోన్, డీప్ టెక్ నేవీకి కూడా అవసరం ఉంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్