Best Web Hosting Provider In India 2024
Sankranthi ki vasthunam Trailer: ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది.. అదిరిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్
Sankranthi ki vasthunam Trailer: సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజైంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎలా ఉంటుందో మరోసారి చూపిస్తూ ఈ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Sankranthi ki vasthunam Trailer: సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో తెలుగువారి ఫేవరెట్ పండుగ సంక్రాంతికే వస్తోందీ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ తో వచ్చిన ప్రతిసారీ విక్టరీ కొట్టాడంటూ వెంకటేశ్ గురించి ట్రైలర్ చివర్లో చెప్పించడం చూస్తుంటే.. ఈ మూవీతో అతడు మరోసారి సక్సెస్ అందుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాల మార్క్ కామెడీని తలపిస్తూ ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది.
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుండగా.. సోమవారం (జనవరి 6) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ మరోసారి కడుపుబ్బా నవ్వించబోతోందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్ గా ఓ హైప్రొఫైల్ కిడ్నాప్ కేసును పరిష్కరించే పాత్రలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్నాడు.
సినిమాలో అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా.. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో అతనికి సహకరించే మరో పోలీస్ ఆఫీసర్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతూ తెగ నవ్వించేశాడు వెంకీ మామ. తన మార్క్ కామెడీ, పంచ్ డైలాగులతో ట్రైలర్ అంతా ఫన్నీగా సాగిపోయింది. ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఓ టీజర్ ఉన్నట్లే.. ప్రతి మగాడి జీవితంలో పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది.. దయచేసి ఆ విషయం మాత్రం మీ పెళ్లాలకు చెప్పకండి అంటూ పెళ్లయిన మగాళ్లకు ఈ ట్రైలర్ ద్వారా ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ చూస్తుంటే వెంకీ, అనిల్ మార్క్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ ఓ హైప్రొఫైల్ కిడ్నాప్ అంటూ సీరియస్ గా మొదలై.. తర్వాత మొత్తం నవ్విస్తూనే సాగిపోయింది. మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేశ్ పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ఈ కేసును అతడు మాత్రమే పరిష్కరించగలడంటూ అతన్ని రంగంలోకి దింపుతారు. అక్కడితే అతని ట్రయాంగిల్ కష్టాలు మొదలవుతాయి.
తన భర్త తనకు మాత్రమే సొంతమనుకునే భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించింది. వాళ్ల మధ్యలోకి ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతో మీనాక్షి ఎంటరవడంతో వెంకీ జీవితం మలుపు తిరుగుతుంది. అతనిపై నమ్మకం లేక ఆమె కూడా ఈ ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.