Best Web Hosting Provider In India 2024
APSCHE Warning: సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీ అనుమతులు రద్దు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వార్నింగ్
APSCHE Warning: ఏపీలో విద్యార్థులను ఫీజుల కోసం ముప్పతిప్పలు పెడుతున్న కాలేజీలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.ఏదొక సాకుతో సర్టిఫికెట్లను జారీ చేయకపోతే కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.ఫీజు రియంబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు.
APSCHE Warning: ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిలిపివేస్తున్న ఘటనలపై ఉన్నత విద్యా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. 2023 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో కాలేజీలు విద్యార్థుల నుంచి వాటిని వసూలు చేస్తున్నాయి.
ఫీజులు కోసం సర్టిఫికెట్లు ఆపితే కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హెచ్చరించారు. విద్యార్థులు ఎవరైనా అడ్మిషన్ వద్దనుకుంటే వారు కట్టిన ఫీజులను వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు.
విద్యార్థులు ఫీజులు కట్టలేదనే కారణంతో వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజుల కోసం విద్యార్థుల ఇబ్బందులకు గురి చేయడం వంటి ఘటనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిల్ని దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఉన్నత విద్యామండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ మధుమూర్తి పలు సూచనలతో కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల్లో అదనపు ఫీజులు వసూలు చేయడం, ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించే విద్యార్థులను ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయడం వంటి చర్యలు తక్షణం నిలిపివేయాలని ఈ తరహా చర్యలతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోందని నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులపై వేధింపులకు పాల్పడే విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేసి, వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతామన్నారు.
కాలేజీలకు నిబంధనలు…
కాలేజీలకు పలు నిబంధనలు విధించారు. ఉన్నత విద్యా మండలి నిర్ణయం ప్రకారం విద్యార్థి అడ్మిషన్ తీసుకున్న తర్వాత సదరు విద్యార్థి అడ్మిషన్ వద్దనుకుంటే మొత్తం ఫీజులో 5శాతం ( ఇది గరిష్టంగా రూ.5 వేలు దాటకూడదు) మించకుండా మిన హాయించుకుని దరఖాస్తుచేసిన 15 రోజుల్లోగా వారు కట్టిన ఫీజులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది .
ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్హులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని అడ గటం ఇకపై నిషిద్ధం. ఏ కోర్సులోనైనా అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి మార్కుల షీట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోకూడదు. వ్యక్తిగతంగా నిర్ధారించి రాసిచ్చిన కాపీలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది .
వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, తిరిగి ఇచ్చేయాలి. అయా పత్రాలపై అనుమానాలుంటే వాటిని జారీచేసిన అధారిటీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేయకూడదు.ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కాలేజీలకు గుర్తింపు రద్దు చేస్తారు.
టాపిక్