Best Web Hosting Provider In India 2024
TTD Negligence: తిరుపతిలో ఘోర విషాదం ఆరుకు చేరిన మృతులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
TTD Negligence: తిరుమలలొ కనీవిని ఎరుగని ఘోర ప్రమాదం జరిగింది. టీటీడీ అధికారుల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం ఆరుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.తిరుపతిలో ఏర్పాటుచేసిన టోకెన్ల జారీలో ఈ తొక్కిసలాట జరిగింది.
TTD Negligence: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కనీవిని ఎరుగని ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు చేసిన కౌంటర్లలో తొక్కిసలాట జరగడంత ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. విష్ణు నివాసంతో పాటు రామా నాయుడు స్కూల్ వద్ద ఉన్న టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది.
నవంబర్ 9వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకు తిరుమలలో టోకెన్ల జారీ ప్రారంభం కానుండగా 24 గంటల ముందే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది. టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించడం, ఒక్కసారిగా గేట్లను తెరవడంతో భక్తులు పరుగులు తీశారు.
రామానాయుడు స్కూల్లో టోకెన్ల జారీ కేంద్రంలోకి గేట్లను తెరిచిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు పరుగులు తీశారు. ఈ క్రమంలో మహిళలు, పెద్ద వయసు వారు కింద పడిపోయారు. కిందపడిన భక్తుల్ని తొక్కుకుంటూ మిగిలిన వారు వెళ్లిపోవడంతో పలువురు భక్తులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. జనవరి 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. దాదాపు పది రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎనిమిది లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసంది.
ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏటా జరిగే కార్యక్రమం కావడంతో ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఉదాసీనంగా వ్యవహరించింది. బుధవారం ఉదయం నుంచి తిరుపతిలోని 90కు పైగా టోకెన్ల జారీ కేంద్రాలకు వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.
టోకెన్ల జారీకి 24 గంటలకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకున్నా టీటీడీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తం కాలేదు. టోకెన్ జారీ కేంద్రాల్లోకి భక్తుల్ని అనుమతించే సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. గంటల తరబడి ఎదురు చూసిన భక్తులు గేట్లు తెరిచిన వెంటనే ముందు వరుసలో నిలిచేందుకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినా వాటిలో డ్రైవర్లు మాత్రం పత్తా లేకుండా పోయారు. తొక్కసలాటలో కిందపడిపోయిన వారిని మిగిలిన భక్తులు అంబులెన్స్‌ల వద్దకు తీసుకువెళ్లినా వాటిని తీసుకువెళ్లేందుకు డ్రైవర్లు లేకపోవడంతో అరగంటకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రికి చేరేలోగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20మందికి పైగా భక్తులు అస్వస్థతతకు గురయ్యారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.
టాపిక్