Best Web Hosting Provider In India 2024
Sreemukhi Apology: పెద్ద మనసుతో క్షమించండి.. నేనూ హిందువునే.. జైశ్రీరామ్ అంటూ యాంకర్ శ్రీముఖి చేసిన వీడియో వైరల్
Sreemukhi Apology: యాంకర్ శ్రీముఖి క్షమాపణ చెప్పింది. తాను హిందువునే అని, జై శ్రీరామ్ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా శ్రీముఖి రామలక్ష్మణులపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఆమె క్షమాపణ చెప్పింది.
Sreemukhi Apology: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాంకర్ శ్రీముఖి రామలక్ష్మణులు ఫిక్షనల్.. దిల్ రాజు, శిరీష్ ఒరిజినల్ అంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు గుప్పించాయి. దీంతో దిగి వచ్చిన శ్రీముఖి.. బుధవారం (జనవరి 8) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
జై శ్రీరామ్ అంటున్న శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి తాజాగా బుధవారం ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. “అందరికీ నమస్కారమండి.. నేను మీ శ్రీముఖి.. నేను రీసెంట్ గా హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణులని ఫిక్షనల్ అనడం జరిగింది. నేనూ ఒక హిందువునే.. నేనూ దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా ఆరాధించేదాన్నే. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి.
ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను. పెద్ద మనసుతో క్షమించమని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్” అని ఆ వీడియోలో చెప్పింది. క్షమాపణలు కోరుకుంటూ.. జై శ్రీరామ్ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ మధ్యే నిజామాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా మూవీ ప్రొడ్యూసర్లయిన దిల్ రాజు, శిరీష్ లను పొగిడే క్రమంలో రామలక్ష్మణులు ఫిక్షనల్.. వీళ్లు ఒరిజినల్ అని చెప్పింది. ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
రామలక్ష్మణులను కల్పితమని ఎలా అంటావంటూ శ్రీముఖిని హిందూ సంఘాల వాళ్లు ఓ ఆటాడుకున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. నిజామాబాద్ కే చెందిన శ్రీముఖి.. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెంకటేశ్ కూడా వెళ్లాడు. అంతకుముందు ఆ ఫొటోలను కూడా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అయితే ఊహించని విధంగా ఈ వివాదం తెరపైకి రావడంతో శ్రీముఖి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వెంకటేశ్ తోపాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు.