Best Web Hosting Provider In India 2024
Naanaa Hyraanaa Song: గేమ్ ఛేంజర్‌లో కనిపించని నానా హైరానా.. అంత ఖర్చు పెట్టి తీశారు.. చివరికి తీసేశారు.. ఇదీ కారణం
Naanaa Hyraanaa Song: గేమ్ ఛేంజర్ మూవీలో నానా హైరానా పాట కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ ఖర్చుతో తీసిన ఈ పాటను సినిమాలో ఎందుకు పెట్టలేదో చెబుతూ మూవీ టీమ్ ఓ ట్వీట్ చేసింది.
Naanaa Hyraanaa Song: గేమ్ ఛేంజర్ మూవీలో ప్రతి పాటనూ కోట్లు ఖర్చు పెట్టి తీశారు. నాలుగు పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. కానీ అందులో ఒకటైన నానా హైరానా సాంగ్ అసలు సినిమాలోనే కనిపించలేదు. దీనికి కారణమేంటో చెబుతూ గేమ్ ఛేంజర్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగిందని, రానున్న రోజుల్లో ఈ పాటను సినిమాలో చేరుస్తామని చెప్పడం విశేషం.
కనిపించని నానా హైరానా
గేమ్ ఛేంజర్ మూవీ శుక్రవారం (జనవరి 10) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎంతో పాపులర్ అయిన నానా హైరానా సాంగ్ మాత్రం మూవీలో లేదు. అర్ధరాత్రి ఒంటి గంటకే షోలు ప్రారంభం కావడంతో ఈ పాట లేకపోవడాన్ని గుర్తించిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై స్పందించిన గేమ్ ఛేంజర్ టీమ్ వెంటనే ఓ ట్వీట్ లో దీనికి కారణమేంటో వివరించింది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పింది.
“ప్రతి ఒక్కరి ఫేవరెట్ నానా హైరానా పాటను గేమ్ ఛేంజర్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ పాటలోని ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్ లను ప్రాసెస్ చేయడంలో కొన్ని సాంకేతిక సవాళ్లు ఎదురవడం వల్లే ఇలా జరిగింది. ఈ పాటను తిరిగి మూవీలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. జనవరి 14 నుంచి ఈ పాటతో కూడిన మూవీ అందుబాటులోకి వస్తుంది” అని గేమ్ ఛేంజర్ టీమ్ వెల్లడించింది.
గేమ్ ఛేంజర్.. పాటలకే భారీ ఖర్చు
గేమ్ ఛేంజర్ మూవీ డైరెక్టర్ శంకర్ మొదటి నుంచీ తన సినిమాల్లో పాటలపై భారీగా ఖర్చు పెడుతుంటాడు. అలా గేమ్ ఛేంజర్ మూవీలోని నాలుగు పాటలపైనా ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. నానా హైరానా పాటను కూడా న్యూజిలాండ్ లో చాలా బాగా చిత్రీకరించారు.
ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా.. కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అసలు ఇన్‌ఫ్రారెట్ కెమెరాతో చిత్రీకరించిన తొలి ఇండియన్ సాంగ్ ఇదే అని మేకర్స్ గతంలోనే చెప్పారు. కానీ ఆ టెక్నాలజీయే ఇప్పుడీ పాటను మూవీకి కొన్ని రోజుల పాటు దూరం చేసింది.
గేమ్ ఛేంజర్ ఎలా ఉందంటే?
గేమ్ ఛేంజర్ సినిమాపై హిందుస్థాన్ టైమ్స్ తెలుగు రివ్యూ ఇది. ఈ మూవీ అబోవ్ యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్టాఫ్‍లో కాసేపు తప్ప.. మిగిలిన చోట్ల పెద్దగా బోర్ అనిపించదు. సెకండాఫ్ మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలు, పదవి, పార్టీ కోసం ఎత్తులు, వెన్నుపోటు, ఎన్నికల అంశాల చుట్టూ ఎక్కువ భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ఓ ట్విస్ట్ మెప్పిస్తుంది.
చరణ్ యాక్టింగ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. డైరెక్టర్ శంకర్.. ఒకప్పటి మార్క్ పూర్తిగా చూపించకపోయినా.. నిరుత్సాహపరచలేదు. చరణ్ యాక్టింగ్, వెండితెరపై గ్రాండ్‍నెస్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఈ సంక్రాంతి పండుగకు ఓసారి తప్పక చూడొచ్చు. అయితే, అంచనాలను కాస్త తక్కువగా పెట్టుకుంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.