Best Web Hosting Provider In India 2024
Cauliflower Masala: దాబా స్టైల్లో కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇలా చేసేయండి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Cauliflower Masala: కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమా? దాబా స్టైల్ లో కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకోండి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
కాలీఫ్లవర్‌తో చేసే కర్రీ ఆరోగ్యానికి మంచిది. పైగా చలికాలంలోనే ఇవి అధికంగా పండుతాయి. కాబట్టి కాలీఫ్లవర్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దాబా స్టైల్ లో కాలీఫ్లవర్ మసాలా కర్రీ వండుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. కేవలం అన్నంతోనే కాదు రోటి, చపాతీతో కూడా ఈ కర్రీని తినవచ్చు. కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – తగినన్ని
పసుపు – ఒక స్పూను
శెనగపిండి – రెండు స్పూన్లు
నెయ్యి – రెండు స్పూన్లు
కారం – రెండున్నర స్పూన్లు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – నాలుగు
యాలకులు – మూడు
బిర్యానీ ఆకు – ఒకటి
ఎండుమిర్చి – రెండు
జీలకర్ర – అర స్పూను
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర స్పూను
టమోటోలు – రెండు
గరం మసాలా – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
పెరుగు – రెండు స్పూన్లు
శెనగపిండి – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కసూరి మేథి – ఒకటిన్నర స్పూను
కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెసిపీ
1. కాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేయాలి.
2. అందులోనే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి పావు గంట సేపు ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి శెనగపిండిని వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి.
5. ఆ వేయించుకున్న శెనగపిండిని తీసి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యిని వేయాలి. ఆ నెయ్యిలో పసుపు పావు స్పూను, కారము ఒక స్పూను వేసి బాగా కలపాలి.
7. అలాగే అర స్పూన్ ఉప్పు కూడా వేయాలి. దాన్ని గరిటతో కలిపాక కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి వేయించుకోవాలి.
8. కాలీఫ్లవర్ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనెను వేయాలి.
9. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకోవాలి.
10. అలాగే ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసి కూడా వేయించుకోవాలి.
11. ఇందులో ఉల్లిపాయల తరుగును వేసి బాగా వేయించాలి.
12. నిలువుగా కోసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.
13. ఇవన్నీ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
14. ఇది వేగుతున్నప్పుడే టమోటోలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకోవాలి.
15. ఆ ప్యూరీని కూడా ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
16. టమోటోలు ఇగురు లాగా అయ్యాక ఒకటిన్నర స్పూను కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
17. ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
18. ముందుగా వేయించి పెట్టుకున్న శెనగపిండిని ఒక గిన్నెలో వేసి చిన్న గ్లాస్ తో నీళ్లు వేసి బాగా గిలకొట్టాలి.
19. ఆ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలుపుకోవాలి.
20. ఇగురు కోసం ఇలా శెనగపిండి మిశ్రమాన్ని వేసుకుంటాము.
21. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ను ఈ కూరలో వేసి బాగా కలపాలి.
22. ఇది ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీళ్లు వేసి పైన మూత పెట్టాలి.
23. మీడియం మంట మీదే ఉంచి ఉడికించాలి. ఇది ఇగురు లాగా దగ్గరగా అయ్యాక పైన కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
24. అలాగే గరం మసాలాను కూడా వేసి కలపాలి.
25. ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయినట్టే.
అన్నంతోనూ, చపాతీతోను, రోటితో కూడా తినేలా ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఉంటుంది. దాబాల్లో ఎక్కువగా ఇదే పద్ధతిలో వండుతారు. మీకు ఈ దాబా స్టైల్ కాలిఫ్లవర్ కర్రీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండుకొని చూడండి.
టాపిక్