Best Web Hosting Provider In India 2024
YS Abhishek Reddy : వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు, ముగిసిన అంత్యక్రియలు
YS Abhishek Reddy : మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆయన పార్థివదేహానికి పులివెందులలో వైఎస్ జగన్, భారతి నివాళులు అర్పించారు. అభిషేక్ రెడ్డి మృతికి పార్టీలకతీతంగా నాయకులు నివాళులు అర్పించారు.
YS Abhishek Reddy : వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డా.వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థిన దేహానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తన సోదరుడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియల నేపథ్యంలో వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. అనంతరం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే అభిషేక్ రెడ్డి మరణించడం ఎంతో బాధాకరమని జగన్ అన్నారు. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ అభిషేక్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పులివెందులలోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి పలువురు వైఎస్సార్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.
వైఎస్ అభిషేక్ రెడ్డి మరణవార్త విని వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి పులివెందులకు అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. తన సోదరుడు మరణవార్త తెలుసుకున్న వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన పులివెందులకు చేరుకున్నారు. అనంతరం అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. పులివెందులలో నిర్వహించిన అంత్యక్రియల్లో జగన్ పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అభిషేక్ మృతదేహానికి నివాళులు అర్పించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి… సహా పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అభిషేక్ పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
ముగిసిన అంత్యక్రియలు
వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి. గత కొద్దిరోజులుగా అభిషేక్ రెడ్డి డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. పులివెందులలో వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు దారి పొడవునా అభిషేక్ రెడ్డి చిత్రపటాలు ప్రదర్శిస్తూ అంతిమ వీడ్కోలు పలికారు.
టాపిక్