Best Web Hosting Provider In India 2024
Game Changer Day 2 Collections: గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల పోస్టర్ వచ్చేసింది.. మరీ ఇంత భారీ డ్రాపా!
Game Changer Day 2 Collections: గేమ్ ఛేంజర్ సినిమా రెండో రోజుల కలెక్షన్లపై పోస్టర్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లతో భారీ తేడా కనిపిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 10నే రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ మూవీ భారీ ఓపెనింగ్ దక్కించుకుంది. రెండో రోజు జోరు తగ్గింది. గేమ్ ఛేంజర్ మూవీ రెండు రోజుల కలెక్షన్లపై అధికారిక పోస్టర్ వచ్చింది.
రెండు రోజుల కలెక్షన్లు.. ఇంత తేడానా!
గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రం తొలి రోజు రూ.186కోట్ల గ్రాస్ సాధించినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో రెండో రోజు రూ.84 కోట్లు వచ్చినట్టు అయింది. ఈ లెక్కల ప్రకారం తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో ఏకంగా రూ.102కోట్ల డ్రాప్ కనిస్తోంది. రెండు రోజుల మధ్య సగానికి పైగా కలెక్షన్లలో డ్రాప్ ఉంది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్ల లెక్కల్లో భారీ తేడా ఉంది.
వసూళ్ల లెక్కలపై జోరుగా చర్చ
గేమ్ ఛేంజర్ చిత్రానికి తొలి రోజు రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించాక.. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. వసూళ్లను మూవీ టీమ్ పెంచి చూపించిందనే రచ్చ జరిగింది. కొందరు మంది నెటిజన్లు ఈ ఆరోపణలు చేశారు. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. ఆ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండవని పోస్టులు చేశారు. అయితే, ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీకి రెండో రోజు కలెక్షన్లలో ఇంత తేడా కనిపించడంతో మరోసారి చర్చ సాగుతోంది. తొలి రోజు తేడాను కవర్ చేసేందుకు మేకర్స్ రెండో రోజు భారీ డ్రాప్ను చూపిస్తున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాను పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ చిత్రంలో రామ్చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కొత్తగా లేదంటూ మిక్స్డ్ టాక్ వచ్చింది. అంచనాలను తగ్గట్టుగా లేదనే కామెంట్లు వినిపించాయి. అయితే, చెర్రీ స్టార్ డమ్తో ఈ మూవీకి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందిందని అంచనా.
గేమ్ ఛేంజర్ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఐఏఎస్ రామ్నందన్, అప్పన్న క్యారెక్టర్లను పోషించారు. అప్పన్న పాత్ర కాసేపే ఉన్నా చెర్రీ తన పర్ఫార్మెన్సుతో మెప్పించారు. ఈ చిత్రంలో కియారా అడ్వానీ, అంజలి కూడా కీలకపాత్రలు పోషించారు. ఎస్జే సూర్య విలన్గా నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరుణావక్కరసు సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్