Best Web Hosting Provider In India 2024
Eluru Robbery: పండుగ పూట ఏలూరులో భారీ దోపిడీ, బంగారు దుకాణంలో రెండున్నర కోట్ల విలువైన నగల అపహరణ
Eluru Robbery: సంక్రాంతి పండుగ వేళ ఏలూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. ఊరంతా పండుగ హడావుడిలో ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురి కావడంతో దుకాణం యజమాని స్పృహ కోల్పోయాడు.
Eluru Robbery: ఏలూరులో పండుగ పూట బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. రెండున్నర కోట్ల విలువైన ఆభరణాలతో పాటు మరో 25కేజీల వెండి అపహరణకు గురైంది. చోరీ చేసిన వ్యక్తి బయటి రాష్ట్రం నుంచి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. దుకాణం వెనుక వైపు గోడకు కన్నం వేసి దుకాణంలోకి వచ్చి నింపాదిగా ఆభరణాలను మూట గట్టుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనతో దుకాణం యజమాని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఏలూరులో లోకేశ్వరి జ్యూవెలరీ షాప్, బ్యాంకర్స్ పేరిట నిర్వహిస్తున్న దుకాణంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాల దుకాణం వెనుక పాడుబడిన భవనం ఉంది. ఆ భవనానికి కేవలం చెక్క తలుపులు అడ్డుగా ఉన్నాయి. ఆభరణాల దుకాణం పరిసరాలపై పక్కాగా రెక్కీ చేసిన నిందితులు వినియోగంలో లేని భవనంలోకి ప్రవేశించి షాపులోకి కన్నం వేసి ప్రవేశించారు. నిందితుల దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.
ఈ ఘటనలో రెండున్నర కోట్ల విలువ చేసే ఆభరణాలు చోరీకు గురయ్యాయి. తాకట్టు పెట్టుకున్న బంగారం కూడా చోరీకి గురైంది. ఉదయం దుకాణం వద్దకు చేరుకున్న యజమాని షాపు తెరవగానే దుకాణం మొత్తం ఖాళీగా ఉండటంతో కుప్పకూలిపోయాడు. చుట్టు పక్కల ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకుంది.
బంగారం దుకాణంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండటంతో దుకాణంలో భారీగా ఆభరణాలు ఉన్నాయి. తాకట్టు పెట్టిన బంగారం కూడా చోరీకి గురైనట్టు బాధితుడు చెబుతున్నాడు. మరోవైపు కొద్ది రోజుల క్రితం పోలీసులు చోరీ జరిగిన దుకాణం నుంచి భారీగా ఆభరణాలను రికవరీ చేసినట్టు స‌్థానిక వ్యాపారులు తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని కుదువు పెట్టుకోవడంతో చాలా ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తాజాగా ఈ ఘటన జరగడంతో యజమాని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని చెబుతున్నారు.
ఈ ఘటనలో దాదాపు రెండున్నర కేజీల బంగారం , 25 కేజీల వెండి చోరీకి గురైనట్టు అంచనా వేశారు. దుకాణం యజమానిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు దుకాణం పరిసరాలను పరిశీలించిన తర్వాత చోరీకి ప్రణాళిక వేసుకున్నట్టు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారుర.
జగ్గయ్యపేటలో ఏడు కిలోల బంగారం..
ఎన్డీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 7 కిలోల నగలు అపహరణకు గురయ్యాయి. స్థానిక ఆభరణాల వ్యాపారి ఇతర ప్రాంతాలకు ఆర్డర్లపై నగలు తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో దుకాణాలకు బంగారం ఇచ్చేందుకు బయలుదేరిన యజమానిని ఏమార్చి డ్రైవర్ నగలతో ఉడాయించాడు. డ్రైవర్ జితేష్ పథకం ప్రకారం డ్రైవర్‌ను మభ్య పెట్టి ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంగారం చోరీకి ముందు భార్యతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.
టాపిక్