Best Web Hosting Provider In India 2024
Vankaya Chutney: వంకాయ తక్కాలి పచ్చడి ఒకసారి ఇలా చేసుకోండి, వేడివేడి అన్నంలో అదిరిపోయేలా ఉంటుంది రెసిపీ ఇదిగో
Vankaya Chutney: వంకాయ కూరను లేదా పచ్చడిని ఒకేలా వండుకుంటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో వంకాయ తక్కాలి పచ్చడి చేసుకుని చూడండి. అద్భుతంగా ఉంటుంది. అన్నంలో అదిరిపోతుంది.
మీకు వంకాయ కూర నచ్చదా? అయితే వంకాయ తక్కాలి పచ్చడి చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. స్పైసీగా అదిరిపోయేలా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయలను కూడా వేస్తాము. కాబట్టి కూర కన్నా ఈ వంకాయ తక్కాలి పచ్చడి టేస్టీగా ఉంటుంది.
వంకాయ తక్కాలి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వంకాయలు – నాలుగు
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఎండుమిర్చి – 15
టమోటోలు – రెండు
చింతపండు – ఉసిరికాయ సైజులో
వెల్లుల్లి రెబ్బలు – పది
ఉల్లిపాయలు – ఒకటి
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
వంకాయ తక్కాలి పచ్చడి రెసిపీ
1. వంకాయ తక్కాలి పచ్చడి చేయడానికి తెల్ల వంకాయలను నాలుగు తీసుకోండి.
2. వాటిని మీడియం సైజు ముక్కలుగా కోసుకోండి.
3. ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేసి వంకాయ ముక్కలను వేసి కాసేపు వదిలేయండి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయండి.
5. ఆ నూనెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి.
6. వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మిగిలిన నూనెలో వంకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోండి.
7. అందులోనే చిటికెడు పసుపును కూడా వేసి బాగా కలుపుకోండి.
8. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను కూడా తీసి పక్కన పెట్టుకోండి.
9. ఇప్పుడు అదే కళాయిలో టమోటో ముక్కలు, చింతపండు వేసి ఒకసారి వేయించుకోండి.
10. ఇప్పుడు రోటిలో ముందుగా ఎండుమిర్చి ,ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా దంచండి.
11. అందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. వీటిని బాగా దంచండి.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇవి బాగా దంచాక టమోటో చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా దంచాలి.
13. ఇవి కూడా బాగా నలిగిపోయాక వంకాయ పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా దంచాలి.
14. అది మెత్తగా అయ్యేవరకు దంచి మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
15. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టాలి.
16. అందులో నూనె వేసి పచ్చి శనగపప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు వేసి ఆ మిశ్రమాన్ని పచ్చడిపై వేసుకోవాలి.
17. అంతే టేస్టీ వంకాయ తక్కాలి పచ్చడి రెడీ అయినట్టే. ఇది వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది.
వంకాయ కూరతో పోలిస్తే వంకాయ తక్కాలి పచ్చడి రుచిగా ఉంటుంది. వంకాయ పచ్చడిని మరోలా కూడా చేస్తారు. స్టవ్ పై కాల్చి వండడం వంటివి కూడా చేస్తారు. ఎలా చేసినా వంకాయ పచ్చడి రుచే వేరు. పూర్వకాలంలో రోటి పచ్చడిని అధికంగా తినేవారు. ఇక్కడ వంకాయ తక్కాలి పచ్చడి కూడా రోటి పద్ధతిలోనే చేసాము. ఒకసారి మేము చేసిన పద్ధతిలో వండి చూడండి. మీకు నచ్చడం ఖాయం.