Best Web Hosting Provider In India 2024
Male Fertility: మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచే ఏడు ముఖ్యమైన విటమిన్లు ఇవే, వీటి కోసం ఏం తినాలంటే
Male Fertility: పురుషులలో సంతానోత్పత్తి రేటును పెంచడానికి సరైన ఆహారాన్ని తినడం అవసరం. వారిలో సంతానోత్పత్తి రేటును పెంచడంలో సహాయపడే కొన్ని విటమిన్లు ఉన్నాయి. వాటి కోసం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినండి.
పెళ్లయిన జంటల్లో ఎంతో మంది పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టకపోతే ఆ లోపం ఆడవారిదేనని అంటారు. నిజానికి మగవారిలో ఉండే లోపాలు కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు కావచ్చు. వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, వాటి నాణ్యత తగ్గినా కూడా గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఆధునిక కాలంలో స్త్రీలు, పురుషులు… ఇద్దరూ సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కుంటున్నారు. జీవనశైలి సమస్యల వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ సమస్యలు కావచ్చు.
మగవారిలో ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, అధిక కొవ్వు వంటి జీవనశైలి అలవాట్ల వల్ల వారిలో సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భనిరోధకాలను ఉపయోగించకుండా ఒక సంవత్సరం పాటు శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా భాగస్వామి గర్భం ధరించలేనప్పుడు ఆ జంటలో ఎవరో ఒకరిలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. స్త్రీ పురుషలిద్దరూ టెస్టులు చేయించుకోవాలి.
వృషణాల పనితీరు, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి అవయవాల సమస్యలు కూడా పురుషుల వంధ్యత్వానికి దారితీస్తాయి. అయితే సగం మంది మగ సంతానలేమి కేసుల్లో కారణాలను గుర్తించడం అసాధ్యం. వీర్యం లేకపోవడం, వీర్యకణాల కదలికలో సమస్యలు ఇందులో భాగం కావచ్చు.
సంతానోత్పత్తిలో పోషకాల పాత్ర
సంతానోత్పత్తి పరంగా పోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు జోడించడం వల్ల సంతానోత్పత్తికి అవకాశం ఉంది. కొన్ని యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యత పెరగడం, స్పెర్మ్ చలనశీలత పెంచడం మొదలైన వాటితో సహా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ముంబైలోని నోవా ఐవీఎఫ్ సెంటర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సంతానలేమి అనేది స్త్రీపురుషులిద్దరిలోనూ ఒకేలా ఉంటుంది. పురుషుల్లో వీర్యకణాల లోపం, అంగస్తంభన లోపం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు ఉండవచ్చు. వీటితో పాటు ఒత్తిడి, మాదకద్రవ్యాల వ్యసనం, మద్యపానం, ధూమపానం, ఊబకాయం, కొన్ని మందులు, వృషణాలకు గాయం, ఇన్ఫెక్షన్లు మొదలైనవి కూడా వంధ్యత్వానికి దారితీస్తాయి. అయితే అవసరమైన విటమిన్లు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చు
పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే విటమిన్లు
డాక్టర్ సురానా ప్రకారం, ఈ విటమిన్లు పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.
విటమిన్ సి: ఇది స్పెర్మ్ ల నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి స్పెర్మ్ ల చలనశీలతను పెంచుతుంది. క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ, బొప్పాయి, నిమ్మకాయలు, జామ, కివి, ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషులలో సంతానోత్పత్తి రేటును పెంచడానికి సహాయపడుతుంది.
విటమిన్ బి 12: వీర్య ఉత్పత్తి ప్రక్రియకు ఇది చాలా ముఖ్యం. చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో విటమిన్ బి 12 ఉంటుంది.
జింక్: ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పరిమాణాన్ని పెంచుతుంది. అలాగే సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. పుట్టగొడుగులు, పాల కూర, గుమ్మడికాయ, చిక్పీస్, మసూరీ పప్పు, పెరుగు అధికంగా తినడం వల్ల జింక్ పొందవచ్చు. మీ శరీరంలో జింక్ కంటెంట్ తక్కువగా ఉంటే, ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్, నాణ్యత లేకపోవడం, సంతానోత్పత్తి సమస్యలకు కారణం అవుతుంది.
విటమిన్ డి: పురుషుల్లో స్పెర్మ్ రేటును తగ్గడానికి విటమిన్ డి లోపం కూడా కారణం కావచ్చు. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం సాల్మన్ ఫిష్, కాడ్ లివర్ ఆయిల్, పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
ఫోలేట్: సంతానోత్పత్తికి ఫోలేట్ చాలా ముఖ్యం. ఫోలేట్స్ సప్లిమెంట్ శరీరంలో వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. నారింజ, ద్రాక్ష, బీన్స్, వేరుశెనగ, అవోకాడోస్, మొక్కజొన్న, సోయాబీన్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫోలేట్ పుష్కలంగా అందుతుంది
విటమిన్ ఇ: యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఇలో ఎక్కువ. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే డ్యామేజ్ ను నివారిస్తుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ డ్యామేజ్ ను నివారిస్తుంది. విటమిన్ ఇ కోసం పొద్దుతిరుగుడు గింజలు, బాదం, బచ్చలికూర, బ్రోకలీలను తీసుకోవడం మంచిది.
సెలీనియం: ఇది ఆరోగ్యకరమైన వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.సెలీనియం పరిమాణం తగ్గడం వీర్యకణాల నాణ్యతపై ప్రభావం చూపుతుంది.అందువల్ల సీఫుడ్, వండిన బీన్స్, పనీర్, అవిసె గింజలు తినాలి.