Best Web Hosting Provider In India 2024
Pushpa 2 Reloaded Version: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ వచ్చేసింది.. 20 నిమిషాలు పెరిగిన మూవీ.. కొత్తగా ఏ సీన్స్ వచ్చాయంటే..
Pushpa 2 Reloaded Version: పుష్ప 2 మూవీ రీలోడెడ్ వెర్షన్ శుక్రవారం (జనవరి 17) థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో అదనంగా మరో 20 నిమిషాలను కలపడం విశేషం. దీంతో మూవీ రన్ టైమ్ మరింత పెరిగింది. మరి కొత్తగా మూవీలోకి వచ్చిన ఆ సీన్లేంటో చూడండి.
Pushpa 2 Reloaded Version: పుష్ప 2 మూవీ గతేడాది డిసెంబర్ 5న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.1830 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మేకర్స్ ఇప్పటికే భారీగా ఉన్న రన్ టైమ్ కు మరో 20 నిమిషాలు జోడించి రీలోడెడ్ వెర్షన్ పేరుతో శుక్రవారం (జనవరి 17) నుంచి థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో పుష్ప 2 రన్ టైమ్ మొత్తంగా 3 గంటల 40 నిమిషాలకు చేరడం విశేషం.
పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్
పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో కొత్తగా కొన్ని సీన్లను మూవీలో యాడ్ చేశారు. ఈ కొత్త వెర్షన్ లో కథ గతంలోకి, వర్తమానంలోకి వస్తూ వెళ్తూ ఉంటుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ తర్వాత పుష్ప రాజ్ చిన్నతనంలోకి స్టోరీ వెళ్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో నీళ్లలో బంతి పడినప్పుడు.. దానిని తీసుకొస్తే ఇంటిపేరుతో పిలుస్తామని వాళ్లు అంటారు. అప్పుడు తనకు ఈత రాకపోయినా అతడు ఎలాంటి సాహసం చేస్తాడన్నది ఈ రీలోడెడ్ వెర్షన్ లో చూడొచ్చు.
ఇంటర్వెల్ సమయంలో మంగళం శ్రీనుతో పుష్ప ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటిగా కొత్తగా వచ్చింది. మరో సీన్‌లో పుష్ప 2 తనను తాను వైల్డ్ ఫైర్ అని చెప్పిన తర్వాత ఎస్పీ షెకావత్ తో ఇక మూటా ముల్లె సర్దుకొని పోదామ్ అని మంగళం శ్రీను అంటాడు. అప్పుడు శ్రీనుతో తనకు ఓ టన్ను ఎర్రచందనం కావాలని అడుగుతాడు. మరో సీన్లో ఎస్పీ షెకావత్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రూట్ కనిపెడతాడు.
ఇక సిండికేట్ లో ఆధిపత్య పోరు, పుష్ప జపాన్ కు వెళ్లి మిస్సయిన షిప్‌మెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం, జక్కా రెడ్డి చనిపోయిన తర్వాత జాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కలవాలని పుష్ప అడగడం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం లాంటి సీన్లు ఈ రీలోడెడ్ వెర్షన్ లో చేర్చారు. కొత్తగా వచ్చిన ఈ సీన్లతో ఈ మూవీ మరింత ఆసక్తికరంగా మారింది.
పుష్ప 2 ఓటీటీ రిలీజ్
పుష్ప 2 ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 56 రోజుల తర్వాతే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ లెక్కన జనవరి 29 తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పుష్ప 1 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండగా.. ఇప్పుడు సీక్వెల్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఇక ఓటీటీలోకి ఈ రీలోడెడ్ వెర్షన్ నే మేకర్స్ తీసుకురానున్నారు. ఆ లెక్కన 3 గంటల 40 నిమిషాల పాటు పుష్ప 2 మూవీ చూడటానికి రెడీగా ఉండాల్సిందే.