Best Web Hosting Provider In India 2024
TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ ఆ రోజు నుంచే, అర్హులను గుర్తించే ప్రక్రియ వేగవంతం-బల్దియాలో దరఖాస్తులెన్నంటే?
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తులను బల్దియా కమిషనర్ ఆధ్వర్యంలో 150 డివిజన్ల వారీగా అధికారులు పరిశీలించారు.
TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డుల జారీకి జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. అర్హులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ కమిషన్ ఇలంబర్తి ఆధ్వర్యంలో అధికారులు 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. ఈ నెల 24వ తేదీ నాటికి అర్హుల ఎంపికను పూర్తి చేసి, 25న నివేదికను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను… ప్రభుత్వం దగ్గరున్న సమాచారంతో సరిచూస్తారు. అనంతరం ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సమగ్ర సర్వే నిర్వహించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 22 లక్షల కుటుంబాల వివరాలను సేకరించగా… కొత్త రేషన్ కార్డుల కోసం అభ్యర్థనలు వచ్చాయి. అధికారుల పరిశీలన తర్వాత 83,285 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు లెక్క తేల్చింది. ఇంటింటి సర్వేలోనూ అనేక మంది కొత్త రేషన్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేయించుకున్నారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, కార్డుల్లో మార్పులు చేయకపోవడంతో…వాటి కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. దీంతో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్… ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. రేషన్ కార్డుల ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. ఆమోదం లభించగా…రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలోనే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. గ్రామ సభల్లో అర్హుల పేర్లు చదువుతారు. అనంతరం దరఖాస్తులను కంప్యూటరీకరించి అర్హులకు ఈ నెల 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు చేర్పుల దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పెళ్లి అనంతరం పుట్టింటి కార్డులో పేరు తొలిగించి, అత్తింటి కార్డుల్లో పేర్లు జోడించాలని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తమ పిల్లల పేర్లు రేషన్ కార్డులో చేర్చాలని తల్లిదండ్రులు అప్లై చేసుకుంటున్నారు. ఇలా కొత్త రేషన్ కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రేషన్ కార్డుల డిజైన్ సైతం మారనుంది. గతంలో ఎలక్ట్రానిక్ రూపంలో కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల డిజైన్ పై మంత్రులు, అధికారులు చర్చిస్తున్నారు.
టాపిక్