Best Web Hosting Provider In India 2024
Nalgonda Collector Tripathi : 100 మంది పంచాయతీ కార్యదర్శులకు షాక్..! నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం
నల్గొండ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరుగులు పెట్టిస్తున్నారు. విధుల్లో ఆలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలకు దిగుతున్నారు. తాజాగా పంచాయతీ కార్యదర్శల విధుల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను బ్రేక్ చేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను బ్రేక్ చేశారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఏం జరిగిందంటే..?
నల్గొండ జిల్లా పరిధిలో పని చేస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకావటం లేదు. ఇదే విషయం కలెక్టర్ దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణ చేపట్టారు. అయితే 100 మంది పంచాతీయ కార్యదర్శులు… విధులకు హాజరుకావటం లేదని గుర్తించారు. వీరంతా కూడా గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఆఫీసులకు రానట్లుగా తేలింది.
ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే వీరంతా కూడా డుమ్మా కొట్టనట్లు విచారణలో గుర్తించారు. దీంతో కఠిన చర్యలకు సిద్ధమైన జిల్లా కలెక్టర్… సంబంధిత కలెక్టర్లపై చర్యలు తీసుకున్నారు. సర్వీస్ బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా.. ప్రస్తుతం పని చేస్తున్న చోటు కాకుండా మరో చోటకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి ఇన్ని రోజులపాటు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం సర్వీస్ బ్రేక్ వరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారని… అంతేకాకుండా వారందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకున్నారని వెల్లడించాయి.
మరోవైపు కలెక్టర్ ఉత్తర్వులతో ఆయా పంచాయతీ కార్యదర్శులు కంగు తిన్నారు. సర్వీస్ బ్రేక్ ఆదేశాలతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలే ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ:
ఇక ఇటీవల జిల్లాలోని గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హరిలాల్తో పాటు విధుల్లో ఉండాల్సిన ఎనిమిది మంది ఉద్యోగులు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
ఒప్పంద ఉద్యోగులైన ఫార్మాసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్లు శ్రీనివాస్, అరుణ జ్యోతి, ఎల్లమ్మలను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది అయిన ఫార్మాసిస్టు భాగ్యమ్మ, అటెండర్ లక్ష్మీనారాయణలను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్