Best Web Hosting Provider In India 2024
KTR Comments : రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కేటీఆర్ మాస్ కామెంట్స్
KTR Comments : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చేవేళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేశారని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడుతా అన్నారని.. ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ కాలేదని ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఎక్కడికైనా పోదాం..
‘ఈ ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే.. ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం. కొడంగల్‌కు పోదాం. రుణమాఫీ అయిందని చెప్తే.. రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే.. మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు..
‘చారాణా రుణమాఫీ కూడా కాలేదు. కానీ ఇవాళ ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు.. నన్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తానని అన్నారు. ఏడాది దాటిపోయింది.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు రూ.7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమైతే.. ఈసీకి ఉత్తరం రాశారు. ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని చెబితే.. మోదీ ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు అయిపోయాక రైతులను ఇబ్బంది పెడుతున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.
అప్పుడు నాట్లప్పుడు.. ఇప్పుడు ఓట్లప్పుడు..
‘కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడుతుండే.. ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కేసీఆర్ జమ చేసిన రూ. 7600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేశారు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. అందుకే ఇవాళ ధర్నా పెట్టాం. ఇది ప్రారంభం మాత్రమే.. రాష్ట్రమంతా ధర్నాలు పెడుతాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వానాకాలం రైతుబంధును ఎగ్గొట్టారు. దాన్ని కూడా విడిచి పెట్టొద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నిలదీయండి..
‘ఆడబిడ్డలకు రేవంత్ ఇస్తానన్న నెలకు రూ. 2500 పడ్డాయా..? తెలంగాణలో ఉన్న మొత్తం కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ఈ ఏడాది రూ.30 వేలు బాకీ ఉన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ముందు మాకు ఇవ్వాల్సిన రూ. 30 వేలు బాకీ తీర్చాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇది ఆరంభం మాత్రమే..
‘ఇది ఆరంభం మాత్రమే. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా, భయపడే ప్రసక్తే లేదు. రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
టాపిక్