Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 18th Episode: అత్తతో కావ్యకు మాటలు కట్ – రుద్రాణికి అపర్ణ మాస్ వార్నింగ్ – సీన్ మొత్తం రివర్స్
Brahmamudi January 18th Episode:బ్రహ్మముడి జనవరి 18 ఎపిసోడ్‌లో తాను చెబితేనే కావ్య నగలు తాకట్టు పెట్టిందని నిందను తనపై వేసుకుంటుంది అపర్ణ. అనుమానాలు, అవమానాలు భరించడం కష్టంగా ఉండటంతో నందగోపాల్ మోసాన్ని ఇంట్లో అందరికి చెప్పేయాలని రాజ్ నిర్ణయించుకుంటాడు.
Brahmamudi January 18th Episode: సీతారామయ్య హాస్పిటల్ బిల్లు కట్టడానికి కావ్య నగలు తాకట్టు పెట్టిన విషయం రుద్రాణి, రాహుల్ బయటపెడతారు. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కావ్యను ఇరికించాలని అనుకుంటారు. కానీ వారి ప్లాన్ బెడిసికొడుతుంది. రుద్రాణిపై రాజ్ ఫైర్ అవుతాడు.
నలుగురు కలిసి నవ్వుకోవడం, ఇంటిల్లిపాది సంతోషంగా ఉండటం నీకు ఎప్పటికీ నచ్చదు కదా అని రుద్రాణికి క్లాస్ ఇస్తాడు రాజ్. నువ్వు, నీ కొడుకు పనిగట్టుకొని ఏదో పరిశోధించినట్లుగా కావ్యను నిలదీయడం చూస్తుంటే నిన్ను ఏమనాలో కూడా తెలియడం లేదని రాజ్ కోప్పడుతాడు.
తాకట్టు పెట్టే దుస్థితి…
రుద్రాణి మాటల్లో తప్పేం లేదని ధాన్యలక్ష్మి వెనకేసుకొస్తుంది. కంపెనీ ఎకౌంట్‌లో డబ్బులు లేవా…నగలు తాకట్టు పెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అది తేలాల్సిందేనని ధాన్యలక్ష్మి అంటుంది. ఏం తేలాలి, ఎక్కడ తేలాలి అని అపర్ణ అందుకుంటుంది. రుద్రాణికి నీకు పెద్ద తేడా ఏం లేదని నువ్వు ప్రతిసారి రుజువు చేస్తూనే ఉన్నావని ఫైర్ అవుతుంది.
నేనే తాకట్టు పెట్టమని చెప్పా…
రుద్రాణి కనిపట్టిన అద్భుతమైన విషయానికి నేను సమాధానం చెబుతానని అపర్ణ అంటుంది. తాను చెబితేనే కావ్య నగలు తాకట్టు పెట్టిందని అంటుంది. నిందను తనపై వేసుకుంటుంది. అపర్ణ మాటలతో దుగ్గిరాల కుటుంబం మొత్తం షాకవుతారు. కంపెనీ అకౌంట్స్ మొత్తం హోల్డ్‌లో పెట్టారని, హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో నేనే నగలు తాకట్టు పెట్టమని కావ్యతో చెప్పానని అపర్ణ చెబుతుంది.
నువ్వెంత నీ లెక్కెంత…
చాకచక్యంగా నీ కొడుకు, కోడలిని కాపాడుకోవడానికి నువ్వు ఆబద్దం ఆడుతున్నావని అర్థమైందని రుద్రాణి అంటుంది. రుద్రాణి మాటలతో అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది. నేను చెప్పింది అబద్ధమని రుజువు చేయమని రుద్రాణితో ఛాలెంజ్ చేస్తుంది అపర్ణ.పక్కవాళ్ల లొసుగులు లాగి ఇంటి బయట చీప్‌గా ప్రవర్తించడం మీకు అలవాటే కదా ఫైర్ అవుతుంది.అసలు నా కొడుకు, కోడలిని ఏ హక్కుతో నిలదీస్తున్నావు. నువ్వెంత..నీ లెక్కెంత, నీ బత్రుకెంత…ఈడ్చి కొడితే నడి రోడ్డు మీద పడతావని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.
కామెన్ సెన్స్ ఉంది కాబట్టే…
కావ్య నగల గురించి రుద్రాణి అడిగినప్పుడు నువ్వే తాకట్టు పెట్టావనే విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మి మధ్యలోకి ఎంట్రీ ఇస్తుంది. స్వప్న సీమంతం జరగకుండా పది మందిలో మీరు గొడవ చేస్తారనే కామన్ సెన్స్ ఉంది కాబట్టే ఆగిపోయానని ధాన్యలక్ష్మికి గట్టిగా ఆన్సర్ ఇస్తుంది అపర్ణ.
నోరు మూసుకొని తినమని అందరికి వార్నింగ్ ఇస్తుంది. అపర్ణ మాటలతో హర్ట్ అయిన రాహుల్, రుద్రాణి సీమంతం వేడుక నుంచి వెళ్లిపోతారు. కృష్ణమూర్తి ఎంత చెప్పిన ఇద్దరు వినరు.
నీపై నమ్మకం పోయింది…
సీమంతం ఫంక్షన్ ముగిసిన వెంటనే అసలు ఏం జరిగిందో…జరుగుతుందో చెప్పమని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. మీ నమ్మకాన్ని పోగొట్టుకునే పని నేను ఎప్పటికీ చేయనని అత్తకు బదులిస్తుంది కావ్య. ఈ రోజుతో నీపై నమ్మకం పోయిందని అపర్ణ బదులిస్తుంది.
ఐదు లక్షల కోసం ఇంటి కోడలు నగలు తాకట్టు పెట్టే దుస్థితి ఎప్పుడు రాలేదు…ఇంటి పెద్ద హాస్పిటల్ బిల్లుకు డబ్బులు లేని ఖర్మ ఎందుకు పట్టిందన్నది ఇప్పుడే తేలాలని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. ఇంటికి ఏదో అరిష్టం రాబోతుందని అనిపిస్తుంది అపర్ణ ఎమోషనల్ అవుతారు.
ఇంటి క్షేమం కోసం…
మిమ్మల్ని మభ్యపెట్టి ఇంటికి కీడు తలపెట్టాలని మేము అనుకోవడం లేదని, మా మాటలను నమ్మితే చాలని అత్తకు సర్థిచెప్పేందుకు కావ్య ఎంత ప్రయత్నించిన అపర్ణ వినదు. రుద్రాణి, ధాన్యలక్ష్మిలా స్వార్థం కోసం కాకుండా ఇంటి క్షేమం, భద్రత కోసమైన ఆ సీక్రెట్ ఏమిటో తనకు ఈ రోజు తెలిసి తీరాల్సిందేనని అపర్ణ పట్టుపడుతుంది.
నగలు తాకట్టు పెట్టాలని అనుకుంటే ఇంట్లో అందరికి చెప్పి చేస్తే అయిపోయేదిగా…రహస్యంగా ఆ పని ఎందుకు చేయాల్సివచ్చిందని కావ్యను నిలదీస్తుంది అపర్ణ. ఇందిరాదేవి మాత్రం కావ్యను వెనకేసుకొస్తుంది. కావ్య ఆ డబ్బులతో హాస్పిటల్ బిల్లు కట్టింది అంతే కానీ వృథా చేయలేదుగా…స్వార్థం కోసం నేరం చేసినట్లు కావ్యను ఎందుకు నిలదీస్తున్నావని అపర్ణతో అంటుంది.
న్యాయంగా ఉందా…
బంధాల పేరు చెప్పి, బాధ్యతలు అంటగట్టి…నేను ఈ బరువు మోయలేను అన్న రోజు నా వెన్నుతట్టి నన్ను ముందుకు నడిపించిన మీరే ఈ రోజు నన్ను ఇంతలా నిలదీయడం మీకు న్యాయంగా ఉందా అని అత్తతో అంటుంది కావ్య. ఏదో ఒకటి జరిగిన రోజు మీరు నన్ను ఇలా నిలదీస్తారని, ప్రశ్నిస్తారని తెలియక ఇంకా మీరు చూపించిన దారిలోనే నడుస్తున్నానని అపర్ణకు సమాధానం చెప్పకుండా కావ్య దాటేస్తుంది. నాకు ఏం తెలియదని చెప్పడం తప్ప తనకు ఇంకో దారి లేదని, నన్ను క్షమించమని అక్కడి నుంచి కావ్య వెళ్లిపోబోతుంది.
మాటలు బంద్…
ఇంట్లో ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది. అడగాల్సిన బాధ్యత నాపై ఉంది. నా మాటకు విలువ ఇవ్వాల్సిన మనిషితో ఇక మాట్లాడటం అనవసరం. నాతో ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయద్దు అని కావ్యతో కోపంగా అంటుంది అపర్ణ. జవాబు తెలిసి చెప్పకుండా దారిన నీతో ఇక నాకు మాట్లాడాల్సిన పని లేదని అంటుంది. ఇంటి పెద్దగా ఆ సమస్య ఏమిటో తానే తెలుసుకోవాలని ఇందిరాదేవి అనుకుంటుంది.
నిజం చెప్పేద్దాం…
రుద్రాణి దిక్కుమాలిన సమస్యలన్నీ మోసుకొచ్చి మన మీద రుద్దుతుందని, పనిపాట ఆమెకు లేదని కావ్య కోపంగా అంటుంది. ఈ అవమానాలకు, అనుమానాలకు అంతులేకుండా పోతుందని వాపోతుంది. సీతారామయ్య ష్యూరిటీతో పాటు నందగోపాల్ చేసిన మోసాన్ని అందరికి చెప్పేద్దామని రాజ్ అంటాడు. నిజం చెబితే జరిగే అనార్థాలను రాజ్‌కు కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది కావ్య. ఒక్కొక్కరు ఏం అంటారో చూపిస్తుంది.
కాకమ్మ కథలు…
ఆస్తిలో వాటా అడిగే సరికి కాకామ్మ కథలు చెప్పి నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారా.. ఎవరిని వెర్రివాళ్లను చేస్తున్నారని రుద్రాణి అంటుందని రాజ్‌కు జరగబోయే సీన్ చూపిస్తుంది కావ్య. మా ఆస్తిని దానం చేసే హక్కు, అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని ధాన్యలక్ష్మి ఏం అంటుందో రాజ్‌కు వివరించి చెబుతుంది కావ్య.
మర్యాదగా మా వాటా మాకు రాసిచ్చి…మీ భాగం మీరు దానం చేసుకుంటారో, ధర్మం చేసుకుంటారో మీ ఇష్టం. పెద్దాయన మాటిచ్చాడని మా చేతికి చిప్ప ఇస్తానంటే ఊరుకునేది లేదని, అవసరమైతే కోర్టుకు ఎక్కుతాను, కుటుంబం పరువు తీస్తానని ధాన్యలక్ష్మి ఊరమాస్ వార్నింగ్ ఇస్తుందని రాజ్‌తో అంటుంది కావ్య.
ఆస్తిలో మాకు వాటా కావాల్సిందేనని రుద్రాణి, ధాన్యలక్ష్మి గొడవలకు దిగుతారని ఏం జరుగుతుందన్నది కళ్లకు కట్టి నట్లుగా రాజ్‌కు వివరిస్తుంది. కావ్య మాటలతో నిజం ఎప్పటికీ బయటపెట్టకూడదని రాజ్ నిర్ణయించుకుంటాడు.
అనామిక షేక్…
వంద కోట్ల ష్యూరిటీ గురించి నిజం తెలుసుకున్న ఇందిరాదేవి…కావ్య, రాజ్‌లకు సాయం చేయాలని అనుకుంటుంది. తన నగలను వారికి ఇస్తుంది. నందగోపాల్ చేసిన మోసంతో పాటు కావ్య, రాజ్ ఆస్తులు తాకట్టు పెడుతోన్న నిజాన్ని బయటపెట్టి దుగ్గిరాల ఫ్యామిలినీ షేక్ చేయాలని అనామిక అనుకుంటుంది. ఆ సీక్రెట్‌ను రుద్రాణికి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.