Best Web Hosting Provider In India 2024
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ.. క్రెడిట్ ఎవరిది? వార్ ఎందుకు?
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు కాస్త ఆక్సిజన్ అందించింది. పరిశ్రమను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై ఏపీలో క్రెడిట్ వార్ జరుగుతోంది. ఈ ఘనత తమదంటే తమదని టీడీపీ, వైసీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ.. ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సంస్థ. ఇలాంటి సంస్థను ప్రైవేట్‌పరం చేస్తారని ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీపం పథకం కింద 100 శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీనిపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత క్రమంలో.. కార్మికుల తొలగింపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, సరిగా జీతాలు చెల్లించకపోవడం వంటి విషయాలపై ఉద్యమాలు జరిగాయి.
తొలుత నమ్మలేదు..
ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు. అప్పుడు కూడా ప్రైవేటీకరణ ఉండబోదని చెప్పారు. కానీ.. కార్మికులు, ఉద్యోగులు నమ్మలేదు. ఆయన వచ్చిన తర్వాత కూడా.. జీతాల చెల్లింపు సరిగా జరగలేదు. దీంతో చాలామంది విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.
ఇరు పార్టీలకు బూస్ట్ ఇచ్చేలా..
ఈ ప్రకటన బాగానే ఉన్నా.. ఇదికాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించడానికి కారణం తామంటే తామని టీడీపీ, వైసీపీ చెప్పుకుంటున్నాయి. అటు కేంద్రమంత్రి కుమారస్వామి కూడా ఇరు పార్టీలకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నా టీడీపీకి కొంచెం ఎక్కువ హైప్ ఇచ్చారు. దీంతో ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ క్రెడిట్ దక్కిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
వైసీపీ గురించి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీని ప్రకటిస్తూ కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘2021 జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100 శాతం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఆ సమయంలో అప్పటి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తీర్మానం చేసింది’ అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ. జగన్ కారణంగానే ఈ ప్యాకేజీ ప్రకటించారని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
టీడీపీ గురించి..
‘గతేడాది అక్టోబర్ 9న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యాం. అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చించిన తర్వాత ఆమె కొంత ఆర్థిక సాయానికి అంగీకరించారు. ఆ తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ప్లాంట్ పునరుజ్జీవానికి ఏం చేయాలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించే బాధ్యతను మెకాన్‌కు అప్పగించాం. ఆ సంస్థ నివేదిక ఆధారంగా మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి రూ.11,440 కోట్ల ప్యాకేజీ నిర్ణయించాం’ అని కుమారస్వామి చెప్పారు. దీంతో చంద్రబాబు కారణంగానే ఈ ప్యాకేజీ సాధ్యం అయ్యిందని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.
బీజేపీ ఇలా..
‘ఆంధ్రప్రదేశ్, విశాఖ ఉక్కు కర్మాగార అభివృద్ధికి ఎన్నటికీ అండగా నిలబడేది ఎన్డీఏ కూటమి’ అని బీజేపీ చెబుతోంది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు రూ. 1,333 కోట్లు ఇచ్చారని స్పష్టం చేస్తోంది. మళ్లీ ఈ ఏడాది ప్రధాని మోదీ నేతృత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే.. క్రెడిట్ ఎవరిదైనా.. స్టీల్ ప్లాంట్‌కు కాస్త మంచి జరిగిందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
టాపిక్