Best Web Hosting Provider In India 2024
TDP in Telangana : తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తాం.. చర్చనీయాంశంగా నారా లోకేష్ కామెంట్స్!
TDP in Telangana : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ టీడీపీని పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారాయి.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని.. నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ.. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. అన్నఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చడానికే కాదు.. పక్కాగృహ నిర్మాణం, జనతావస్త్రాల పథకాలను తెచ్చారని చెప్పారు.
తెలంగాణ ప్రజల్లో ప్రేమ..
‘తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్పూర్తితో మేం అహర్నిశలు పనిచేస్తున్నాం. తెలంగాణలోనూ పార్టీని పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. స్వచ్చందంగా ప్రజలేవచ్చి 1.60 లక్షలమంది సభ్యత్వం తీసుకున్నారు. గతంలో తెలంగాణలో అత్యధిక సభ్యత్వం ఉండేది. తెలుగుదేశం పార్టీపై తెలంగాణ ప్రజల్లో ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనానికి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా..
ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో.. తల్లి భువనేశ్వరితో కలిసి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు… తెలుగుజాతి చరిత్రలో ఓ ప్రభంజనం అని లోకేష్ కీర్తించారు. సినిమాల్లో, రాజకీయాల్లో నెం.1గా నిలచిన వ్యక్తి అని కొనియాడారు. అన్నిరకాల సినిమాలుచేసి తనదైన ముద్రవేశారన్నారు.
మహనీయుడు ఎన్టీఆర్..
రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లో ప్రభంజనం సృష్టించి.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ నారా లోకేష్ కొనియాడారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని వ్యాఖ్యానించారు. ఆనాడు తెలుగువారంటే మదరాసీలు అనే వారని.. తెలుగుజాతి గర్వించేవిధంగా మనగళాన్ని ఢిల్లీలో వినిపించారని స్పష్టం చేశారు. ఆయనను అన్యాయంగా బర్తరఫ్ చేస్తే.. తెలుగుజాతి ఏకతాటిపైకి వచ్చి పోరాడి తిరిగి ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న..
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని లోకేష్ వివరించారు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ‘ఒకవ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ.. ఈనాడు కోటిమంది సభ్యుల కుటుంబంగా మారడం గర్వంగా ఉంది. ఏ ఆశయాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో ఆ ఆశయాల కోసం అందరం కలసికట్టుగా కృషిచేస్తాం. తెలుగువారు ఎక్కడున్నా వారిని ఉన్నతస్థానంలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.
రెండు రాష్ట్రాల కోసం..
‘మేము కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా.. కార్యకర్తలే మమ్మల్ని దారిలో పెడతారు. గత ఏడునెలలుగా చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తిరిగి గాడిలో పడింది. నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాల తెలుగుజాతి కోసం కలసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నాం’ అని లోకేష్ గుర్తు చేశారు.
టాపిక్