Best Web Hosting Provider In India 2024
Cauliflower recipe: కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే సాంబారు రసం చపాతీలలో అదిరిపోతుంది
Cauliflower recipe: కాలీఫ్లవర్ చాలా రుచిగా ఉండే కూరగాయ. దీంతో వేపుడు చేసుకున్నారంటే అదిరిపోతుంది. ఇక్కడ మేము కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఎలా చేయాలో తెలుసుకోండి.
కాలిఫ్లవర్ ఎక్కువగా దొరికేది శీతాకాలంలోనే. చలికాలం ముగిసిపోక ముందే కాలిఫ్లవర్ తో చేసుకోవాల్సిన వంటకాలన్నీ ఓసారి చేసుకొని తినేయండి. ఇక్కడ మేము కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఇది సాంబారు, రసం, చపాతి… దేనితో తిన్నా రుచిగా ఉంటుంది. పైగా ఎంతో ఆరోగ్య కరం కూడా. కాలీఫ్లవర్ అనగానే పురుగులు ఏరడానికి ఎంతో మంది భయపడుతూ ఉంటారు. నిజానికి ముందుగానే నీటిలో కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక పావుగంట పాటు వదిలేస్తే పురుగులన్నీ పైకి తేలిపోతాయి. అప్పుడు తీసేయొచ్చు, లేదా వేడి నీటిలో కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉంచినా చాలు. పురుగులన్నీ చనిపోయి పైకి తేలుతాయి. అప్పుడు కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి పురుగులకు భయపడి కాలీఫ్లవర్ తినడం మానేయకండి. ఇక్కడ మేము కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. దీన్ని వండుకుంటే సాంబార్ తో, పప్పుతో, రసంతో సైడ్ డిష్‌గా అదిరిపోతుంది. చపాతీలో కూడా తింటే టేస్టీగా ఉంటుంది. కాలిఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు – రెండు కప్పులు
పసుపు – అర స్పూను
నీరు – తగినన్ని
నూనె – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
ఉల్లిపాయలు – రెండు
కరివేపాకులు – గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూను
పుదీనా తరుగు – ఒక స్పూను
టమోటోలు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – రెండు స్పూన్లు
మిరియాల పొడి – ఒకటిన్నర స్పూను
కొత్తిమీర తరుగు – గుప్పెడు
కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ
1. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చేసేందుకు ముందుగా తాజా కాలీఫ్లవర్ ను ఎంపిక చేసుకోండి.
2. దాన్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కోసుకోండి.
3. ఒక గిన్నెలో నీరు, పసుపు, చిటికెడు ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించండి.
4. తర్వాత వాటిని తీసి వడకట్టి కాలీఫ్లవర్ ముక్కలను పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి జీలకర్ర వేసి వేయించండి.
6. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించుకోండి.
7. అందులోనే దంచుకున్న అల్లం వెల్లుల్లి, కరివేపాకులను వేసి బాగా వేయించండి.
8. పుదీనా ఆకులను కూడా వేసి వేయించండి. టమోటో ముక్కలను సన్నగా తరిగి వేయించండి.
9. అందులోనే పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపండి.
10. పైన మూత పెట్టి టమోటాలు మెత్తగా అయ్యేవరకు మగ్గించండి.
11. టమాటాలు మెత్తగా అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలపండి.
12. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోండి.
13. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి.
14. మూత తీసాక మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి.
15. అందులోనే కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలపండి.
16. ఇది వేపుడు లాగా పొడిపొడిగా అయ్యే వరకు చిన్న మంట మీద వేయించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెసిపీ రెడీ అయినట్టే.
కాలీఫ్లవర్ పెప్పర్ వేపుడు రెసిపీ ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మీకు మరీ మరీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటికి శాఖాహారాన్ని తినే అతిధులు వచ్చినప్పుడు ఈ వేపుడును పెట్టి చూడండి. మీకు కచ్చితంగా వారికి నచ్చుతుంది. అన్నంలో కూడా దీన్ని కలుపుకునే విధంగా ఉంటుంది. చపాతీ రోటీతో నంజుకున్నా కూడా బాగుంటుంది. అలాగే సాంబారు, పప్పు, రసం వంటివి చేసుకున్నప్పుడు ఈ సైడ్ డిష్ ను చేసుకుంటే జత అదిరిపోవడం ఖాయం. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి తెలుస్తుంది దీని రుచి.
సంబంధిత కథనం