Best Web Hosting Provider In India 2024
Drone On Pawan Camp Office : పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థదే
Drone On Pawan Camp Office : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ఎగరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
Drone On Pawan Camp Office : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం జనసేన పార్టీ ఆఫీసుపై డ్రోన్ చక్కర్లు కొట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ డ్రోన్ ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్ గా తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో ఏపీ ఫైబర్ నెట్ అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు పోలీసులు గుర్తించారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా పోలీసులు తేల్చారు. రెండ్రోజులుగా ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు….పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో డ్రోన్ సర్వే చేపట్టినట్లు గుర్తించారు.
డ్రోన్ వ్యవహారంపై డీజీపీ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. పవన్ కల్యాణ్ భద్రతపై ప్రతీ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామన్నారు. పవన్ కల్యాణ్ ఇంటపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ చేస్తామన్నారు. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అనేది నిర్ధారిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదన్నారు. పవన్ పర్యటన అనంతరం పోలీస్ దుస్తుల్లో వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని డీజీపీ వెల్లడించారు.
రాజమండ్రిలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు…పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…పవన్ భద్రతపై ప్రతి అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. కానీ ఇంకాస్త సమయం కావాలని కోరడంతో ఇవాళ్టి వరకు దర్యాప్తునకు అవకాశం కల్పించామన్నారు. డ్రోన్ ఎగరడంపై పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారన్నారు. నేటి సాయంత్రానికి డ్రోన్ ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా నకిలీ పోలీసు ప్రత్యక్షం, విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం సమయంలో విద్యుత్ అంతరాయం, తాజాగా పవన్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలను వేరువేరుగా చూస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం జరగలేదని, కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు డీజీపీ పేర్కొ్న్నారు. విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరాను ఎవరు ఎగురవేశారు? అది డ్రోన్ కెమెరానా? అనేది ప్రాథమికంగా నిర్ధారణకు వస్తామని తెలిపారు. అయితే డ్రోన్ ప్రభుత్వానిదేనని పోలీసులు తేల్చారు.
సంబంధిత కథనం
టాపిక్