Best Web Hosting Provider In India 2024
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు
Kolkata Rape and Murder Case Verdict : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు పడింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కోల్‌కతా సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్జీ కర్ అత్యాచారం-హత్య కేసులో జనవరి 18న సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించిన కోర్టు సోమవారం అతడికి శిక్షను వేసింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించింది. దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయవాది ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు.
సీల్దా కోర్టు న్యాయమూర్తి దోషి సంజయ్ రాయ్‌తో మాట్లాడుతూ మీపై ఏం ఆరోపణలు వచ్చాయో, మీపై ఎలాంటి ఆరోపణలు రుజువు అయ్యాయో గత రోజు చెప్పానని అన్నారు. అయితే దీనిపై నిందితుడు సంజయ్.. న్యాయమూర్తితో మాట్లాడుతూ.. నేనేమీ అత్యాచారం, హత్య చేయలేదు. నన్ను తప్పుగా ఇరికిస్తున్నారని చెప్పాడు.
నన్ను ఇరికించారు : సంజయ్
‘నేను నిర్దోషిని. నన్ను చిత్రహింసలకు గురిచేశారు. వారు కోరుకున్నదానిపై నాతో సంతకం చేయించారు. నన్ను మాట్లాడనివ్వడం లేదు. సీబీఐ కస్టడీలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు నన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేరం చేసి ఉంటే అది ఊడిపోయేది.’ అని సంజయ్ అన్నాడు.
అన్నింటిని పరిశీలించాకే దోషిగా
విచారణ సమయంలో నాతో మాట్లాడేందుకు సగం రోజు సమయం ఇచ్చినట్టుగా న్యాయమూర్తి గుర్తుచేశారు. మూడు గంటలు మీ మాటలు విన్నానని చెప్పారు. అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నీ ఉన్నాయని వెల్లడించారు జడ్జి. అన్నింటినీ పరిశీలించే దోషిగా తేల్చినట్టుగా స్పష్టం చేశారు.
17 లక్షల పరిహారం
ట్రైనీ డాక్టర్ కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సంజయ్ రాయ్‌కి రూ.50,000 జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరైన ట్రైనీ డాక్టర్ తండ్రి నిందితుడి నుంచి రూ.10 లక్షలు తీసుకోవడానికి నిరాకరించి తనకు న్యాయం చేయాలని మాత్రమే కోరారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఇది చట్టబద్ధమైనది, అందుకే నిందితుడిని మీకు చెల్లించాలని ఆదేశించాను అని అన్నారు.
సంజయ్ రాయ్‌కు శిక్ష గురించి కోర్టు సీబీఐని అడగడంతో దర్యాప్తు సంస్థ రాయ్ నేరాన్ని ‘అరుదైన కేసులలో అరుదైనది’గా పేర్కొంది. అతనికి మరణశిక్ష విధించాలని కోరింది. బాధితురాలు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అని, అలాంటి వ్యక్తి చనిపోవడం కుటుంబానికే కాదు.. సమాజానికి కూడా లోటు అని చెప్పింది.
అసలు ఏం జరిగిందంటే?
ఆగస్ట్ 9, 2024న కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లోని సెమినార్ గదిలో బాధితురాలి మృతదేహం కనిపించింది. అత్యాచారం, హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పశ్చిమ బెంగాల్‌లోని జూనియర్ డాక్టర్ల నుండి నిరసనలు మెుదలు అయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు తెలిపారు. ఈ కేసును మొదట కోల్‌కతా పోలీసులు విచారించారు. అయితే కలకత్తా హైకోర్టు జోక్యంతో తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI)కి కేసు వెళ్లింది. తర్వాత నిందితుడిగా సంజయ్‌రాయ్‌ని గుర్తించారు. విచారణ చేశారు. దోషిగా తేల్చారు. ఈ కేసును సుప్రీం కోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది. పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Best Web Hosting Provider In India 2024
Source link