Best Web Hosting Provider In India 2024
Khuska Pulao: ఖుస్కా.. టేస్టీ పులావ్ ఇది ఒకసారి వండి చూడండి రెసిపీ ఇదిగో
Khuska Pulao: ఖుస్కా ఎక్కువగా రెస్టారెంట్లలోనే తింటూ ఉంటారు. నిజానికి దీంట్లో చాలా సులువుగా వండుకోవచ్చు. ఖుస్కా రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
ఖుస్కా పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఈ పులావ్ తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. ఇంట్లో దీన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. ఖుస్కాను కొంతమంది ప్లెయిన్ బిర్యానీ అని కూడా అనుకుంటారు. ఇది బిర్యానీ కన్నా పులావ్ అని పిలవడమే కరెక్ట్. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కూర వండాలనిపించకపోతే అప్పుడప్పుడు ఇలా ఖుస్కా పులావ్ చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది.
ఖుస్కా పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
నెయ్యి – మూడు స్పూన్లు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – నాలుగు
యాలకులు – నాలుగు
అనాసపువ్వు – ఒకటి
జాజికాయ – చిన్న ముక్క
ఉల్లిపాయలు – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
బిర్యానీ ఆకు – ఒకటి
సోంపు గింజలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
కారం – ఒక స్పూను
టమోటోలు – రెండు
గరం మసాలా – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – అరకప్పు
పుదీనా తరుగు – అరకప్పు
కొత్తిమీర తరుగు – అర కప్పు
బాస్మతి రైస్ – ఒక కప్పు
నీళ్లు – ఒక కప్పు
ఖుస్కా పులావ్ రెసిపీ
1. ఖుస్కా పులావ్ చేయడం చాలా ఈజీ. మీరు ముందుగానే బాస్మతి బియ్యాన్ని కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యిని వేయాలి.
3. ఆ నెయ్యిలోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాజికాయ వేసి వేయించుకోవాలి.
4. తర్వాత సోంపు గింజలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి.
5. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.
6. వీటిని రంగు మారేవరకు వేయించాలి. అలాగే ఒక బిర్యాని ఆకును కూడా వేసి వేయించుకోవాలి.
7. ఈ మొత్తం మిశ్రమం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
8. ఆ తరువాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇవి బాగా వేగాక టమోటాను చిన్న ముక్కలుగా కోసుకొని వేయాలి.
10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి.
11. ఆ తర్వాత గరం మసాలా పొడిని కూడా వేయాలి.
12. అర కప్పు పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. దీని మీద మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఇది ఇగురు లాగా ఉడికి పైకి తేలుతుంది.
14. పుదీనా తరుగును, కొత్తిమీర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
15. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి.
16. కప్పు బియ్యం వేస్తే కప్పు నీళ్లను వేయాలి. కుక్కర్ పై మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
17. దీన్ని హై ఫ్లేమ్ మీదే ఉంచాలి. ముందుగానే బియ్యం నానాయి. కాబట్టి అన్నం ఉడికిపోతుంది.
18. కేవలం ఒక విజిల్ వస్తే చాలు. ఒక విజిల్ వచ్చాక 20 నిమిషాల పాటు కుక్కర్ మూతను తీయకూడదు. లోపల ఉన్న ఆవిరి మీదే అన్నం మెత్తగా ఉడుకుతుంది. అంతే ఖుస్కా రెడీ అయినట్టే. వేడి వేడిగా తింటే అదిరిపోతుంది.
ఖుస్కా పులావ్ వండేందుకు మీరు సాధారణ బియ్యాన్ని ఉపయోగిస్తే ఒక కప్పు బియ్యానికి ఒకటి ముప్పావు కప్పు నీళ్ళను వేసుకోవాల్సి వస్తుంది. బాస్మతి బియ్యం కాబట్టి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీరు సరిపోతుంది. ఒకసారి ఈ ఖుస్కా పులావ్ వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం