Best Web Hosting Provider In India 2024
రామతీర్థం కేసులో నిందితుడికి ప్రభుత్వ సాయమా?
గట్టిగా నిలదీసిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఎందుకిచ్చారు?
ఆ ఘటనలో మీ పాత్రపై మాకు అనుమానాలు వస్తున్నాయి
బీజేపీ, సనాతనవాది పవన్‌కళ్యాణ్ దీన్ని ఎలా సమర్థిస్తున్నారు?
అసలు మీరు ప్రజలకు ఏం సందేశం పంపిస్తున్నారు?
ప్రెస్మీట్లో బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న
విజయనగరం: మూడేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం (తల నరికిన) ఘటనలో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు సాయం ఇవ్వడం చూస్తుంటే ఆ ఘటనలో టీడీపీ పెద్దల పాత్రపై అనుమానాలు వస్తున్నాయని మండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆ కేసులో నిందితుడికి ప్రభుత్వ సొమ్ము ఇవ్వడమే కాకుండా ఆ కార్యక్రమంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత ప్రశ్నించారు.
అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?:
మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ 2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఆరోజు సంఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయ నిధి నుంచి నిందితుడికిచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడిని డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?.
బహుమానంగా ఇచ్చారా?:
ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా?. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలి.
వారెందుకు నోరు మెదపడం లేదు?:
ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్, హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే బీజేపీ ఏం చేస్తున్నాయి?. వారెందుకు నోరు మెదపడం లేదు?. ప్రభుత్వ చర్యను వారెలా సమర్థిస్తున్నారు?.
ప్యాకేజీ మతలబ్ ప్రైవేటీకరణ:
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని, కేంద్ర హోంమంత్రితో ఆ మాట చెప్పించకపోవడం వెనుక మతలబ్ కూడా ప్రైవేటీకరణ చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది.
కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరినీ వదలకుండా అందరినీ కూటమి నాయకులు వంచించారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.