Best Web Hosting Provider In India 2024
అన్ని పనుల్లోనూ భారీ కమీషన్లకు తెరలేపిన సర్కారు పెద్దలు
అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా స్కెచ్
ఆపై అందినకాడికి దండుకునేలా కార్యాచరణ.. ఇందుకు ఏ శాఖా మినహాయింపు కాని వైనం
వైద్య శాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం
ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టులు చేజిక్కించుకొనేందుకు పన్నాగం
చిన్న సంస్థలు కన్సార్షియంగా పాల్గొనకుండా నిబంధనలు
బడా కంపెనీలతో ఓ మంత్రి, జనసేన ప్రజాప్రతినిధి డీల్
ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్టు పేరిట దేవుడి సొమ్ముకు ఎసరు
ఏడు ప్రధాన ఆలయాల పనులు ఒకే సంస్థకు కట్టబెట్టే యత్నం
ఆలయాలు సొంతంగా టెండర్లు పిలవకుండా ముకుతాడు
ఏకీకృత విధానం పేరుతో రెట్టింపు దోచుకునేందుకు వ్యూహం
మహిళలకు కుట్టు పనిలో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీనీ వదలని వైనం
ఎక్కడా లేని షరతులతో అస్మదీయులకు టెండర్ కట్టబెట్టే వ్యూహం
అమరావతి: ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరుగుతున్నట్లు హడావిడి చేయడం.. ఆ ముసుగులో అందినకాడికి దండుకునేందుకు మంత్రాంగంతో యంత్రాంగాన్ని పురమాయించడం.. ఆపై అనుకూల సంస్థలకే టెండర్లు దక్కేలా తిమ్మినిబమ్మి చేస్తూ నిబంధనలు మార్చడం.. ఆ తర్వాత ఇష్టానుసారం ఎస్టిమేషన్లతో సర్కారు ఖజానాకు కన్నం వేయడం కూటమి ప్రభుత్వ పెద్దలకు పరిపాటిగా మారింది. ఏ మంత్రిత్వ శాఖలో ఏ పనికి టెండర్ పిలవాల్సి వచ్చినా, తొలుత ముఖ్య నేత దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. ఆ నేత సూచనల మేరకే సదరు మంత్రి మధ్యవర్తిత్వంతో కాంట్రాక్టు సంస్థ ఏదన్నది ముందుగానే ఫైనలైపోతోంది.
ఆ తర్వాత ఆ సంస్థకే కాంట్రాక్టు దక్కేలా చేసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా చకచకా పావులు కదులుతున్నాయి. ఇందులో సంస్థ గత అనుభవంతో పని లేదు.. ఎంత బాగా పని చేసిందన్నది అక్కర్లేదు.. అసలు ఆ సంస్థకు అర్హత ఉందా అన్నది అసలే అవసరం లేదు. దిక్కుమాలిన షరతులతో టెండర్లు పిలవడం.. ఇతర సంస్థలన్నింటిపై అనర్హత వేటు వేయడం.. అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడమే ప్రధానం. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే.. తప్పుడు కేసులు పెట్టి అయినా వారి నోరు మూపించడం మామూలైపోయింది. రాష్ట్రంలో ఏడు నెలలుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి మచ్చుకు మూడు ఉదాహరణలు ఇలా ఉన్నాయి.
పెద్ద కంపెనీలే ముద్దు
రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడేళ్లకు రూ.1,300 కోట్ల విలువైన సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం వైద్య శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం ఆస్పత్రులను మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. ఈ పనులను ఇప్పటి వరకు ఎక్కడికక్కడ చిన్న చిన్న కంపెనీలు చేసేవి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న యువ మంత్రి జోక్యంతో సీన్ మారిపోయింది. చిన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా నిబంధనలు మార్చేశారు. ఎక్కువ టర్నోవర్ ఉండే పెద్ద కంపెనీకే కాంట్రాక్ట్ దక్కేలా చక్రం తిప్పారు.
గతంలో రాష్ట్ర వైద్య శాఖలో అత్యవసర వైద్య సేవల కాంట్రాక్టు నిర్వహించిన సంస్థతోపాటు, ఉత్తరాదికి చెందిన బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడి సెక్యూరిటీ నిర్వహణ సంస్థకు కాంట్రాక్టులు దక్కేలా ఓ మంత్రి, జనసేనకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ముందుండి నడిపిస్తున్నట్లు సమాచారం. జోన్–1లో కాంట్రాక్ట్‌లు జనసేన కోటాగా కేటాయించారు. చిన్నా చితకా కంపెనీలు కన్షార్షియంగా టెండర్లు వేసినప్పటికీ, వారికి పనులు దక్కకుండా ఆపరేషనల్ ఎక్స్పెండేచర్ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్యే ఉండాలంటూ మరో నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలో టెండర్లు వేసిన వారందరూ 3.85 శాతం ఎలాగూ వేస్తారని, అయితే ఎక్కువ టర్నోవర్ ఉన్న వారినే ఎల్1గా పరిగణిస్తారని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
‘కుట్టు’ టెండర్లో కనికట్టు!
రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ టెండర్లలో భారీ అవినీతికి రంగం సిద్ధమైంది. అస్మదీయులు ఒకరిద్దరికి టెండర్ కట్టబెట్టేలా దేశంలో మరెక్కడా లేని షరతులు ముందుకొచ్చేశాయి. ఏపీ బీసీ సహకార సంస్థ లిమిటెడ్ ద్వారా 46,044 మంది బీసీ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లను పంపిణీ చేసేందుకు గత నెల 18న ప్రభుత్వం టెండర్‌ను ఆహ్వానించింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.25 వేల చొప్పున రూ.115 కోట్లు టెండరు మొత్తంగా పేర్కొంది. గత నెల 31వ తేదీ తుది గడువు కాగా ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాలి. ఒక్కో బ్యాచ్‌లో 50 మందికి తక్కువ కాకుండా ఉండాలి.
బయోమెట్రిక్, మాన్యువల్ హాజరు నమోదు చేయాలి. షార్ట్ టెండర్ అయినప్పటికీ వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మందికి పైగా టెండర్లు దాఖలు చేశారు. గత పది ఆర్థి క సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఒక్క ఏడాదైనా పది వేల మందికి కుట్టు పనుల్లో శిక్షణ ఇచ్చి ఉండాలనేది టెండరులో ముఖ్య నిబంధన. దీనిపై ప్రీ బిడ్ సమయంలో టెండర్‌దారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ‘సర్దుబాటు ఒప్పందాల’కు ఇబ్బంది లేకుండా ముఖ్య నేత సూచనతో లబ్ధిదారుల సంఖ్య 92,088కు, టెండర్ విలువ రూ.230 కోట్లకు పెంచేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా శిక్షణ ఇచ్చి ఉండవచ్చని చెబుతూ తాజాగా టెండర్‌ను ఆహా్వనించారు. అస్మదీయులకు టెండర్ కట్టబెట్టడానికే ఇలా చేశారని టెండరుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే సంస్థకు ఆలయాల్లో ‘క్లీనింగ్’!
రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను ఒకే సంస్థకు అప్పగించేందుకు వీలుగా ‘ముఖ్య’ నేత డైరెక్షన్లో దేవదాయ శాఖ అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఏ ఆలయానికి ఆ ఆలయమే పారదర్శకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టులు అప్పగించి పనులు చేయించుకునే విధానాన్ని నిలిపి వేసి, నెలానెలా కాంట్రాక్టును పొడిగిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఏకీకృత విధానం పేరుతో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం ఆలయాల్లో పనులు ఒక్కరికే అప్పగించేలా స్కెచ్ వేశారు. ఏటా ఈ ఆలయాలకు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఒక్కోదానికి ఆదాయం ఉంటుంది. ఇంత భారీగా ఆదాయం ఉన్నందున ఒకే సంస్థకు పారిశుధ్య నిర్వహణ అప్పగిస్తే అనుకున్న రీతిలో దండుకోవచ్చని స్కెచ్ రూపొందించారు.
2015–19 మధ్య చంద్రబాబుకు బంధువుగా చెబుతున్న భాస్కరనాయుడు అనే వ్యక్తికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్విసు సంస్థకు ఏడు ఆలయాల క్లీనింగ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. అప్పట్లో క్లీనింగ్ పనులు సరిగా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ సంస్థలకు ఆయా ఆలయాలు రెట్టింపు డబ్బు చెల్లించినట్లు ఆ శాఖ అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉమ్మడి టెండర్ విధానానికి స్వస్తి పలకడంతో ఈ దందా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో భాస్కర్‌నాయుడితో పాటు అలాంటి వాళ్లు తెరపైకి వచ్చి దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.