Best Web Hosting Provider In India 2024
Emergency OTT: ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకే కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా.. వివరాలివే
Emergency OTT: ఎమర్జెన్సీ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఏ ఓటీటీలోకి వస్తుందో వెల్లడైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..
బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఎమర్జెన్సీ’ మూవీపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను ఈ హిస్టారికల్ బయోగ్రాఫికల్ చిత్రంలో పోషించారు కంగనా. దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 పరిస్థితుల ఆధారంగా ఎమర్జెన్సీ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి కంగనా రనౌతే దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందే వివాదం కాగా.. సెన్సార్ కూడా అభ్యంతరం చెప్పింది. అయితే, ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రం గత వారం జనవరి 17వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయింది.
ఓటీటీ ఏదంటే..
ఎమర్జెన్సీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. దీంతో థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో రిలీజైన సుమారు ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తుంటాయి. దీని ప్రకారం ఎమర్జెన్సీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మార్చిలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎమర్జెన్సీ చిత్రంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే, అశోక్ చబ్రా, విశాఖ్ నాయర్, మహిమా చౌదరీ, మిలింగ్ సోమన్, దర్శన్ పాండ్యా కీలకపాత్రలు పోషించారు. దర్శకురాలిగా కంగన ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా కథనం ఆసక్తికరంగా సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బాక్సాఫీస్ నిరాశే
ఎమర్జెన్సీ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా భారీ ఓపెనింగ్ దక్కించుకోలేకపోయింది. మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో పెద్దగా పుంజుకోలేకపోయింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.11.39 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. సుమారు రూ.60కోట్ల రూపొందిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశే మిగిలేలా ఉంది. కంగనకు మరో ఫ్లాఫ్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎమర్జెన్సీ చిత్రాన్ని మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ పతాకాలపై కంగనా రనౌత్, రేణి పిట్టి నిర్మించారు. ఈ చిత్రం గతేడాదిలోనేే రిలీజ్ కావాల్సింది. అయితే, సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆలస్యమైంది. కొన్ని మార్పుల తర్వాత సెన్సాన్ సర్టిఫికేట్ రావటంతో ఈనెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్, ఆర్కో, సచిత్, అంకిత్ బల్హారా మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేయగా.. టెట్సౌ నగాటా సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం