Best Web Hosting Provider In India 2024
TG Panchayat Secretaries : ఇలాగైతే పనిచేయడం కష్టం.. సెలవులు పెట్టే ఆలోచనలో పంచాయతీ కార్యదర్శులు!
TG Panchayat Secretaries : తెలంగాణలో వేలాది మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఏ పథకం ప్రజలకు అందాలన్నా వీరి పాత్ర కీలకం. లబ్ధిదారుల ఎంపిక మొదలు.. గ్రామాల అభివృద్ధి వీరిపైనే ఆధారపడి ఉంది. అంతటి బాధ్యత కలిగిన కార్యదర్శులు ఇప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక సెలవులు పెట్టే ఆలోచన చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 4 కీలక పథకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తోంది. అర్హులను గుర్తించే పనిలో పడింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారు.
భయపడుతున్నారు..
అయితే.. ఈ కీలక ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ముఖ్యం. కానీ వారు ప్రస్తుతం గ్రామాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రజలు దాడులు చేస్తారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పని ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఇన్‌ఛార్జిలను నియమించి పనులు చేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు..
నగరాలు, పట్టణాలతో పోలిస్తే.. గ్రామాల్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు వారికి రాకపోతే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికార పార్టికి చెందిన స్థానిక నాయకులు ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లలేక.. గ్రామాలకు వచ్చే పంచాయతీ కార్యదర్శులను నిలదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో చాలామంది కొత్తవారు కావడంతో.. పరిస్థితులను ఎదుర్కోలేక భయపడుతున్నారు.
లగచర్ల ఘటనతో..
ఉదాహరణకు.. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఒక గ్రామంలో 40 మంది దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఏడుగురి పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయి. దీంతో గ్రామాలకు వెళ్తే.. పేర్లు లేనివారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇటీవల లగచర్లలో జరిగిన అధికారులపై దాడి ఘటనను గుర్తుచేసుకొని పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లడం లేదు.
ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి..
కీలక పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దీంతో కలెక్టర్లు ఎంపీడీవోలపై ఒత్తిడి పెంచుతున్నారు. వారు పంచాయతీ కార్యదర్శులను పరుగులు పెట్టిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. దీంతో అటు ఉన్నతాధికారులు, ఇటు స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు పథకాలు అందని వారినుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం కంటే.. మానేయడం ఉత్తమం అనే అభిప్రాయాలను పంచాయతీ కార్యదర్శులు వ్యక్తం చేస్తున్నారు.
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పరిశీలన..
గ్రామసభల నేపథ్యంలో ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లింది. గ్రామ, వార్డు సభలు ప్రారంభం కాగానే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం తిట్టుకున్నారు. పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. మరికొన్నిచోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. తమపేర్లు జాబితాలో ఎందుకు లేవని గట్టిగా ప్రశ్నించారు. దీంతో గ్రామసభలకు వచ్చిన అధికారులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
కార్యదర్శుల బాధ ఇదీ..
హిందుస్తాన్ టైమ్స్ తెలుగుతో ఓ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. ‘మేం చేసే పని చేస్తున్నాం. అందరి పేర్లు ఎందుకు రాలేదంటే మాకెలా తెలుస్తుంది. గ్రామాల్లో ప్రజల మెప్పుకోసం రాజకీయ పార్టీల నాయకులు మమ్మల్ని తిడుతున్నారు. మరికొందరు తమపై దాడిచేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. మా గ్రామం కాకుండా ఇంకో గ్రామం బాధ్యతలు నాకే అప్పగించారు. పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. పైగా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కంటే ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటడం మేలు అనిపిస్తుంది’ అని మహిళా పంచాయతీ కార్యదర్శి వాపోయారు.
టాపిక్