Best Web Hosting Provider In India 2024
TG Cyber Crime : సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక!
TG Cyber Crime : సైబర్ మోసాలపై అధికారులు ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి సైబర్ సెల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి కీలక సూచనలు చేశారు. క్రిప్టో కరెన్సీ, వ్యవసాయం, దుస్తులు, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల విక్రయం మాటున.. పిరమిడ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతున్నాయన్నారు.
రోజువారీ ఆదాయం, కొత్త సభ్యులను చేర్చే గొలుసు వ్యాపారం అంటూ సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కమీషన్లు ఇస్తామని మాయ చేస్తున్నారు. అమాయక ప్రజలను సైబర్ బాధితులుగా మార్చుతున్నారు. ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాలపై అప్రమత్తంగా ఉండాలని.. సంగారెడ్డి సైబర్ సెల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి సూచించారు. ఇలాంటి మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
మోసాలు చేసే విధానం..
ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు.. నిజమైన, లాభదాయకమైన వ్యాపార కార్యకలాపాలు కావు. పాత పెట్టుబడిదారులకు చెల్లించడానికి కొత్త పెట్టుబడులపై ఆధారపడతాయి. పిరమిడ్ పైభాగంలో ఉన్నవారు మాత్రమే గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఎక్కువ మంది పెట్టుబడిదారులు కష్టపడి సంపాదించి.. ఇందులో పెట్టుబడి పెట్టి డబ్బును కోల్పోతారు. ఇలాంటి వాటిల్లో ఎక్కువ శాతం విదేశాలలో పనిచేసే వారు కీలకంగా ఉంటారు. సేకరించిన నిధులు జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు మళ్లిస్తారు. ఇది దేశ భద్రతకు ముప్పు.
ఇవీ జాగ్రత్తలు..
1.తప్పుడు వాగ్దానాల పట్ల జాగ్రత్త: లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు, అధిక రాబడి వంటివి కేవలం మోసగాళ్లు పన్నిన ఉచ్చు అని గుర్తించాలి. నిజమైన వ్యాపారాల ద్వారా ఎప్పుడూ రాత్రికి రాత్రే అధిక లాభాలు రావు.
2.కంపెనీ పేర్లు గుర్తించండి: మోసగాళ్లు మోసం చేయడానికి పేరు పొందిన కంపెనీల పేర్లను దుర్వినియోగం చేస్తారు. ఆ కంపెనీని గుర్తించడానికి అధికారిక అవుట్‌లెట్, కార్యాలయాన్ని సందర్శించాలి.
3. చైన్‌లను నివారించండి: ఆదాయం సంపాదించడానికి కొత్త సభ్యులను నియమించుకోవాల్సిన ఏ పథకంలోనూ పెట్టుబడి పెట్టవద్దు.
4.కార్యక్రమాలకు హాజరు కావద్దు:- మోసగాళ్లు తప్పుదారి పట్టించడానికి ప్రేరణాత్మక చర్చలు, ఆకట్టుకునే ఈవెంట్‌లు, ప్రెజెంటేషన్‌లను ఉపయోగిస్తారు. వీటికి హాజరు కావొద్దు.
5.అప్రమత్తంగా ఉండండి: వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండాలి. వీటిని ఉపయోగించి సైబర్ ఉచ్చులోకి లాగుతారు.
6.వ్యక్తిగత డేటా భద్రం: అనుమానాస్పద ఏపీకే ఫైల్, లింక్‌లు లేదా యాప్‌లపై క్లిక్ చేయవద్దు. వీటిలో మీ సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడిన మాల్వేర్ ఉండవచ్చు.
7.పూర్తిగా పరిశోధించండి: విలువలేని క్రిప్టో కరెన్సీలకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించే మోసపూరిత పంప్-అండ్-డంప్ స్కీమ్‌ల గురించి తెలుసుకోండి.
8.క్రాస్ చెక్ చేయండి: ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సైట్లను పరిశీలించాలి.
9.డబ్బు డిపాజిట్ చేయవద్దు: పూర్తిగా తెలుసుకోకుండా ఏ వ్యక్తి, ఖాతాకు డబ్బును బదిలీ చేయవద్దు.
10.అవగాహన కల్పించండి: కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించండి.
11.సమాచారం ఇవ్వండి: మీ చుట్టూ ఏదైనా మోసం జరుగుతున్నట్లు గుర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ వాట్సాప్ నంబర్ 8712672222 కు సమాచారం ఇవ్వాలి.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్