Best Web Hosting Provider In India 2024
Visakha Crime: విశాఖపట్నం జిల్లాలో బాలికపై అత్యాచారం…హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యం…
Visakha Crime:విశాఖపట్నం జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. హోటల్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికొచ్చి బాలిత తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు
Visakha Crime: విశాఖలో మాయమాటలతో బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పీఎం పాలెంలోని హెచ్‌పీసీఎల్ లేఅవుట్‌కు చెందిన ఎన్. సాయితేజ (30) బక్కన్నపాలెం రోడ్డులో బట్టల షాప్ నడుపుతూ జీవనం సాగిస్తోన్నాడు. ఆయన భార్య, కుమారుడు ఉన్నారు.
సాయితేజకు మధురవాడకు చెందిన బాలిక (16), ఆమె తమ్ముడు (15)తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు బాలిక తమ్ముడు, సాయితేజ కలిసేవారు. బాలిక కూడా అప్పుడప్పుడు తమ్ముడితో బట్టల షాప్‌కి వచ్చేది.
ఈ క్రమంలో సోమవారం సాయితేజ తన బావమరిదిని, బాలికను, ఆమె తమ్ముడిని తీసుకుని రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. రూమ్‌లో సాయితేజ, తన బావమరిది, బాలిక తమ్ముడు ముగ్గురు కలిసి మందు తాగారు. అప్పుడు బాలిక వారితోనే ఉంది. అయితే మందు తాగడం పూర్తి అయిన తరువాత సాయితేజ బావమరిది, బాలిక తమ్ముడు ఇద్దరూ తినడానికి భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్లారు.
దీంతో రూమ్‌లో బాలిక, సాయితేజ మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయమని భావించిన సాయితేజ బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె వద్దని ఎంతవారించినా వినిపించుకోకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో హోటల్ నుంచి బాలిక ఇంటికి వెళ్లిపోయింది. ఏడుస్తూ తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పీఎం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. మరోవైపు బాలిక తమ్ముడికి కూడా తల్లిదండ్రులు చీవాట్లు పెట్టారు. పోక్సో కేసు కావడంతో డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును విచారించనున్నారు.
భీమిలిలో దివ్యాంగు బాలికపై అత్యాచారం
భీమిలో దివ్యాంగు బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. న్యాయమూర్తి నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒక గ్రామంలో బోర ఎల్లయ్యరెడ్డి (49) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోన్నాడు. పక్క ఇంట్లో ఉన్న దివ్యాంగు బాలిక (11) కుటుంబం ఉంటుంది. ఆమె మానసిక స్థితి బాగాలేకపోవడంతో పాటు పోలియోతో మంచంపైనే ఉంటుంది.
అయితే తల్లిదండ్రులు ప్రతిరోజూలానే మంగళవారం కూడా కూలీ పనులకు వెళ్లిపోయారు. బాలికకు సంరక్షురాలిగా ఉన్న నాన్నమ్మ సమీపంలో ఉన్న గొర్రెల వద్దకు వెళ్లింది. దీంతో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన ఎల్లయ్యరెడ్డి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. పోలియోతో నడవలేని స్థితిలో ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.ఈ ఘటనపైబాధితుల ఫిర్యాదు మేరకు నార్త్ ఏసీపీ అప్పలరాజు, భీమిలి సీఐ సుధాకర్, ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో సహా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్