Best Web Hosting Provider In India 2024
TTD Darshans: తిరుమలలో టోకెన్లు లేకుండా నేరుగా క్యూలైన్లలోకి భక్తులు.. కొత్త విధానంపై టీటీడీ కసరత్తు
TTD Darshans: తిరుమలలో గత పది రోజులుగా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కాకుండానే వెనుదిరగాల్సి వస్తోంది.ఈ క్రమంలో నేటి నుంచి టోకెన్లు లేని వారిని క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
TTD Darshans: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. రెండ్రోజుల క్రితమే వైకుంఠ దర్శనాలు ముగియడంతో సర్వ దర్శనం క్యూలైన్లలోకి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. భక్తులను వేగంగా దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా, నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ముందస్తు దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం లభించక పోవడంతో రద్దీ కొనసాగుతోంది.
వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో రెండ్రోజులుగా తిరుమలకు పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వారందరికి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల రద్దీ తగ్గే వరకు సర్వ దర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. గురువారం తెల్లవారు జాము నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునః ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
టోకెన్లు లేకుండా దర్శనాలపై కసరత్తు..
శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చే భక్తులు నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్‌లలోకి చేరుకునేలా కొన్నేళ్లుగా టైమ్ స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై తిరుమలకు వచ్చే భక్తులను టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించడంపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
ప్రస్తుతం టోకెన్లు దక్కించుకోవడం ఓ ఎత్తైతే ఆ తర్వాత దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండటం మరో సమస్య అవుతోంది. టోకెన్లు లేకుండా దర్శనాలు కల్పించడంపై తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతిచెందిన నేపథ్యంలో భక్తులకు మెరుగైన సేవల్ని అందించడంపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
భక్తులకు తిరుపతిలో టోకెన్లు ఇవ్వకుండా తిరుమలలో నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో నిత్యం 60వేల మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారు. వారిని నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ చర్చలు జరుపుతోంది. దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
టాపిక్