Best Web Hosting Provider In India 2024
Kids Health: మీ పిల్లల మెదడుకు విషంతో సమానం ఈ ఆహారాలు, వారి జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి
Kids Health: పిల్లల మేధో వికాసం కోసం వారి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పిల్లల మెదడు ఎదుగుదలకు ఏమాత్రం మంచిది కాని కొన్ని ఆహారాలను ఈ రోజు మీకు చెబుతున్నాము. వీలైనంత వరకు వాటిని పిల్లల ఆహారం నుండి దూరంగా ఉంచండి.
పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరం. ముఖ్యంగా వారి ఎదుగుదల వేగంగా జరిగే వయసులో వారికి పెట్టే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల భవిష్యత్తుకు వారి మెదడు చక్కగా పనిచేయాలి. అప్పుడు వారు చక్కగా చదవగలుగుతారు. చిన్నప్పటి నుంచి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసేయాలి. వాటిని తినిపించడం వల్ల వారికి ఎంతో నష్టం కలుగుతుంది. పిల్లలకు పెట్టకూడని ఆహారాలు, పానీయాల గురించి ప్రతి తల్లీదండ్రి తెలుసుకోవాలి.
ఈ స్నాక్స్
మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి హాని చేసే ఆహారాలను పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ప్యాకెట్ చిప్స్, నూడుల్స్, రెడీ టు ఈట్ స్నాక్స్, కుకీస్, డ్రింక్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రుచులు, రంగులు అనేకం కలిపి ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి హానికరం. ఈ రకమైన ఆహారాలను ఎక్కువగా తినడం పిల్లలలో ప్రవర్తనా మార్పులకు కారణమవుతుంది. ఇది వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.
కూల్ డ్రింకులు
చిన్న వయస్సులోనే పిల్లలు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేదా ఇతర ఏరేటెడ్ డ్రింక్స్ వంటి కెఫిన్ కలిగిన పానీయాలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వీటన్నింటిలో చాలా ఎక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో హైపర్యాక్టివిటీ, నిద్రలేమి, చంచలత, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఫాస్ట్ ఫుడ్
మార్కెట్ లో ఫాస్ట్ ఫుడ్ లు అధికంగానే దొరుకుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. తల్లిదండ్రులు… పిల్లలు ఇలాంటివి తక్కువగా తినేలా చూసుకోవాలి. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లల మెదడు పెరుగుదలకు మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అనారోగ్యకరమైన కొవ్వులు పిల్లల మెదడు కణాల అభివృద్ధి, పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇది పిల్లల మేధో వికాసాన్ని నెమ్మదిస్తుంది.
తీపి పదార్థాలు
పిల్లల సరైన ఎదుగుదల కోసం వారికి తీపి పదార్థాలు ఇవ్వకుండా దూరం పెట్టాలి. ముఖ్యంగా మార్కెట్ లో దొరికే క్యాన్డ్ జ్యూస్ లు, డ్రింక్స్ ను పిల్లలకు ఇవ్వకూడదు. వాటిలో చక్కెర, ముఖ్యంగా కృత్రిమ స్వీటెనర్లు నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది పిల్లల ఏకాగ్రత స్థాయి, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాటు, అవి గట్ ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది మెదడు ఆరోగ్యం, శారీరక అభివృద్ధితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
చక్కెర పదార్థాలు
పిల్లలు రంగురంగుల క్యాండీలు, జెల్లీ, పొడి చక్కెరను ఇష్టపడతారు. కానీ చక్కెరతో పాటు, కృత్రిమ రంగులను కూడా వాటికి కలుపుతారు. ఈ రెండూ పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కృత్రిమ రంగులను మనం సాధారణంగా పట్టించుకోము. కానీ ఇది పిల్లలలో ఆందోళన, హైపర్యాక్టివిటీ, తలనొప్పి, ఎడిహెచ్డి వంటి అభిజ్ఞా సమస్యలను కలిగిస్తుంది. ఇవన్నీ పిల్లల మేధో వికాసంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం