Best Web Hosting Provider In India 2024
IT Raids on Sukumar: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకెళ్లి మరీ!
IT Raids on Sukumar: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టాలీవుడ్‍కు సంబంధించిన మరికొందరు ప్రముఖుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
టాలీవుడ్‍లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడుల సెగ కొనసాగుతోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో నేడు (జనవరి 22) సోదాలకు దిగారు ఐటీ అధికారులు. మంగళవారం (జనవరి 21) నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప నిర్మాతల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. ఇప్పుడు పుష్ప డైరెక్టర్ సుకుమార్‌కు కూడా ఐటీ సెగ తగిలింది. ఆ వివరాలివే..
ఎయిర్‌పోర్టు నుంచి తీసుకొచ్చి..
దర్శకుడు సుకుమార్ ఇంట్లో నేటి తెల్లవారుజామున ఐటీ అధికారుల సోదాలు మొదలైనట్టు తెలుస్తోంది. వేరే చోటికి వెళ్లేందుకు సుకుమార్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా.. ఆయనను ఐటీ అధికారులు ఇంటికి తీసుకొచ్చారని తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో వివరాలు అడిగేందుకు విమానాశ్రయానికి అధికారులు వెళ్లి మరీ ఆయనను ఇంటికి తిరిగి తీసుకొచ్చారని సమాచారం.
పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ ఇళ్లలో ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయి. ముమ్మరంగా తనిఖీలు సాగాయి. ఇప్పుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడి జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం రూ.1800కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు మూవీ టీమ్ ఇటీవలే వెల్లడించింది. ఈ తరుణంలో ఈ ఐటీ దాడులు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్, చెల్లింపులు, లావాదేవీలు కలెక్షన్ల లెక్కలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొందరు ఇళ్లలో సోదాలు కంటిన్యూ
టాలీవుడ్ బడా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍ఎఫ్‍డీసీ) ఛైర్మన్ దిల్‍రాజుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై మంగళవారమే ఐటీ అధికారులు దాడి చేశారు. ఉజాల్ విల్లాస్‍లోని దిల్‍రాజు ఇంటితో పాటు జూబ్లీ హిల్స్ సహా ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన చోట్ల తనిఖీలు చేశారు. ఈ సోదాలు రెండో రోజు నేడు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
దిల్‍రాజు భారీ బడ్జెట్‍తో నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికే ఈ నెల రిలీజ్ అయింది. ఆయన ప్రొడక్షన్‍నే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా విడుదలైంది. భారీ బడ్జెట్లు, కలెక్షన్ల లెక్కలను పరిశీలించి, పన్ను లెక్కలను తేల్చేందుకు ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొందరు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు సుమారు 50కి పైగా బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పలువురు నిర్మాత ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ ఈ స్థాయిలో భారీగా సోదాలకు దిగడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ సినీ జనాల్లో నెలకొంది.
సంబంధిత కథనం