Best Web Hosting Provider In India 2024
TG New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ-అర్హులందరికీ కార్డులు, ఆరు కిలోల సన్నబియ్యం-మంత్రి ఉత్తమ్
TG New Ration Cards : తెలంగాలలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామసభల్లో ఆందోళన నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
TG New Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 26న ఈ నాలుగు కొత్త పథకాలను ప్రారభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటి నుంచి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తూ…లబ్దిదారుల జాబితాలు ప్రకటిస్తున్నారు అధికారులు. జాబితాల్లో పేర్లు లేనివాళ్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభల్లో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామన్నారు.
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్ని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు అన్నింటినీ పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. జాబితాలో పేర్లు లేకపోతే గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇవాళ అప్లై చేసుకున్నా అర్హులకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను మోసం చేశారని మండిపడ్డారు.
40 లక్షల మందికి లబ్ది
అర్హతగల చివరి వ్యక్తి వరకూ రేషన్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 40,000 మందికి మాత్రమే రేషన్ కార్డులు అందించారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ 40 లక్షల మందికి లబ్ధిచేకూరేలా కొత్త రేషన్ కార్డుల మంజూరు విధానంలో మార్పులు చేసి అర్హులందరికీ కార్డులు అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ఆరు కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వ్యవసాయయోగ్యమైన భూములకు ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు.
నారాయణపూర్ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే 70 వేల ఎకారాల భూమి ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామన్నారు.
24 వరకు దరఖాస్తులకు అవకాశం
కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకు జరిగే గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పెద్దఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ నెల 26న నుంచి అర్హులందరికీ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్