Best Web Hosting Provider In India 2024
పెరుగుతోపాటూ ఈ ఆహారాలు కలిపి తింటే మీ పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది
పెరుగు ఆరోగ్యానికి మంచిది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తింటే మాత్రం పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి పెరుగుతో కలిపి తినకూడని ఆహారాలు తెలుసుకోండి.
రోజూ ఒక కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము. అయితే పెరుగుతో పాటు కొన్నిరకాల ఆహారాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పేగుల్లో అనారోగ్యాలు తలెత్తవచ్చు. పెరుగు తినడం పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది ఎంతో సహాయపడుతుంది. అయితే పెరుగుతో కొన్ని ఆహారాలు జత చేసి తింటే మాత్రం ఆ ఫుడ్ కాంబినేషన్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎలాంటి ఆహారాలను పెరుగుతో పాటు తినకూడదు తెలుసుకోండి.
చేపలు
చేపలతో భోజనం చేశాక చివరలో చాలామంది పెరుగన్నం తింటూ ఉంటారు. అలాంటి పని చేయకూడదు. మీరు చేపలతో భోజనం చేశాక.. ఆ పూట పెరుగును తినక పోవడమే అన్ని విధాలా ఉత్తమం. కప్పు పెరుగు తిన్నాక చేపల ఫ్రై తినడం లేదా చేపల వేపుడు తిన్నాక పెరుగు తినడం వంటివి పూర్తిగా మానేయండి. ఆయుర్వేదం ప్రకారం పెరుగు, చేపలు వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థల సమస్యలకు కారణమవుతాయి. ఈ కాంబినేషన్ అజీర్తి సమస్యలు, దద్దుర్లు, అలెర్జీ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.
మామిడిపండు
చాలామందికి పెరుగన్నంలో మామిడిపండు నంజుకుని తినే అలవాటు ఉంటుంది. పెరుగు మామిడికాయలు రెండు విడివిడిగా చూస్తే పోషకహారాలే వాటిని కలిపి తినడం వల్ల ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు పెరిగిపోతాయి. మామిడిపండు తియ్యగా వేడి లక్షణాలను కలిగిస్తుంది. పెరుగు పుల్లగా చల్లని లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల పీహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది జీర్ణక్రియకు భంగం కలిగిస్తుంది. పేగుల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఉల్లిపాయ
పెరుగన్నం, మజ్జిగ, అన్నంలో ఉల్లిపాయ నంజుకుని తినేవారికి సంఖ్య కూడా ఎక్కువే. గ్రామాల్లో ఇప్పటికీ ఇలా తినేవారు ఉన్నారు. అయితే పెరుగుతో పాటు ఉల్లిపాయలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఉల్లిపాయలు శరీరం పై వేడి ప్రభావాన్ని కలిగిస్తాయి. పెరుగు చల్లని లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది పొట్ట ఉబ్బరానికి, గ్యాస్ట్రిక్ సమస్యలకు, పొట్ట నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి రెండింటి కాంబినేషన్లో ఆహారం తినకూడదు.
వంకాయలు, టమోటోలు
వంకాయ కూర, టమాటో కూర తెలుగిళ్లలో అధికంగానే ఉంటుంది. పెరుగన్నంతో ఈ కూరలు నంజుకుని తినేవాళ్ళు కూడా ఎక్కువే. నిజానికి పెరుగన్నంతో ఈ కూరలు కలిపి తినకూడదు. ఇది యాసిడ్ రిఫ్లెక్షకు కారణం అవుతుంది. కాబట్టి ఇది పొట్టలో ఆమ్లత్వానికి కారణం అవుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)