Best Web Hosting Provider In India 2024
Madha Gaja Raja: 12 ఏళ్ల కిందటి విశాల్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు.. తెలుగులోనూ వచ్చేస్తోంది
Madha Gaja Raja: తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన 12 ఏళ్ల కిందటి మూవీ మదగజరాజ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
Madha Gaja Raja: మదగజరాజ మూవీ ఈ ఏడాది పొంగల్ కు రిలీజై తమిళనాడు ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. నిజానికి 12 ఏళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది పండుగకు రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. తమిళనాట రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం విశేషం. గతేడాది అరణ్మనై 4 మూవీ ద్వారా సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ సుందర్ సి ఈ మదగజరాజను కూడా డైరెక్ట్ చేశాడు.
అయితే ఊహకందని విధంగా తమిళనాడు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో మదగజరాజ మూవీ ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అందుకుంది. 12 ఏళ్ల కిందటి మూవీకి ఈ స్థాయి వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. అందులోనూ రూ.15 కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందింది. దీంతో మేకర్స్ పై లాభాల వర్షం కురుస్తోంది.
తెలుగులోనూ రిలీజ్
విశాల్ నటించిన మదగజరాజ మూవీ తెలుగులోనూ రాబోతోంది. ఈ మూవీని డబ్ చేసి జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు తమిళ ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పొంగల్ కు మనతోపాటు అక్కడ కూడా వచ్చిన శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ ఫెయిల్యూర్ కూడా ఈ మదగజరాజ బాక్సాఫీస్ వసూళ్లకు కారణమైంది.
తెలుగులోనూ ఈ సినిమాకు ఆశించిన మేర వసూళ్లు వస్తే మాత్రం మదగజరాజ బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. సంతానం ముఖ్యమైన పాత్ర పోషించాడు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించాడు.
సంబంధిత కథనం
టాపిక్