Best Web Hosting Provider In India 2024
పబ్లిసిటీ ఫుల్.. పెట్టుబడులు నిల్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
దావోస్ నుంచి ఉత్తి చేతులతో వస్తున్న చంద్రబాబు బృందం
పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించడంలో ఘోర వైఫల్యం
చంద్రబాబు ప్రచార యావకే దావోస్ పర్యటన పరిమితం
నారా లోకేష్ భజనలో పోటీ పడిన సహచర మంత్రులు
అంతర్జాతీయ వేదికపై రెడ్ బుక్ ప్రస్తావన సిగ్గుచేటు
ప్రపంచ దేశాల ముందు ఏపీ పరువు తీసిన లోకేష్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ
రాష్ట్ర ఆర్థికస్థితిపై సీఎం వ్యాఖ్యలతో ప్రతికూలత
ఒక్క పారిశ్రామికవేత్త నుంచైనా నిర్దిష్ట హామీ లేదు
దావోస్ ఖర్చు రూ.20 కోట్లు.. బూడిదలో పోసిన పన్నీరు
వేల కోట్ల పెట్టుబడులకు పొరుగు రాష్ట్రాల ఒప్పందాలు
కూటమి ప్రభుత్వ వైఖరితో తరలిపోతున్న పరిశ్రమలు
మా హయాంలో వచ్చిన జిందాల్నూ తరిమేశారు
ప్రెస్మీట్లో గుర్తు చేసిన గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తామని దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తమ అసమర్థత కారణంగా ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలో రాష్ట్ర బృందం విఫలమైందని ఆయన గుర్తు చేశారు. కేవలం ప్రచార యావకే పరిమితమై, పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్సీపీ విశాఖపట్నం సిటీ ఆఫీస్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడారు.
రిక్త హస్తాలతో తిరిగిరాక:
సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, పలువురు మంత్రులు, అధికారులు నాలుగు రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పర్యటనను పరిమితం చేసి, రాష్ట్రానికి రిక్త హస్తాలతో వారు తిరిగి వస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రూ.8.5 లక్షల కోట్లు, తెలంగాణ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తుంటే, చంద్రబాబు మాత్రం దావోస్ పర్యటన కోసం ఖర్చు చేసిన రూ.20 కోట్ల ప్రజాధనానికి పైసా విలువ కూడా లేకుండా చేశారు.
అంతర్జాతీయ వేదికలపైన రాజకీయ ప్రసంగాలా?:
దావోస్‌లో ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అంతర్జాతీయంగా పెట్టుబడులకు అవకాశం ఉన్న చోట్ల ప్రాజెక్టలను ప్రారంభిస్తారు. అటువంటి దావోస్ వేదికను చంద్రబాబు, ఆయన కొడుకు తమ రాజకీయ ప్రసంగాలతో నవ్వుల పాల్జేశారు.
సాక్షాత్తూ సీఎం అయిన చంద్రబాబు, తమ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, చాలా పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని అంత పెద్ద వేదికపై చెప్పడం వల్ల ఏ పారిశ్రామికవేత్త అయినా, ఇక్కడ పెట్టుబడులకు ముందుకొస్తారా? ఇక రాష్ట్రానికి యువరాజులా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్, ఏకంగా భారత రాజ్యాంగానికి పోటీగా తాను సొంతంగా తయారు చేసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఆ వేదికపై నిసిగ్గుగా ప్రకటించడం చూసి ఎవరైనా ఈ రాష్ట్రంలో కాలు పెట్టేందుకు సాహసిస్తారా? పైగా నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, సీఎం ఇవ్వాలంటూ సహచర మంత్రులు అంతర్జాతీయ వేదికలపైన చేసిన భజన చూసి పారిశ్రామికవేత్తలే అవాక్కయ్యారు. ఇలాంటి వైఖరిని దావోస్ లో ప్రదర్శిస్తూ పారిశ్రామికవేత్తలతో సీఎం, అధికారులు ఎన్ని చర్చలు జరిపినా ఏ ఒక్కరూ పెట్టుబడులపై నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు.
వైయస్ఆర్సీపీ హయాంలో భారీ ప్రాజెక్టులు:
మా ప్రభుత్వ హయాంలో మేము ఒకసారి దావోస్ వెళ్ళాం. పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించాం. రాష్ట్రంలోని వనరులు, అవకాశాలను వివరించాం. పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకువచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మా హయాంలో వచ్చిన ప్రాజెక్ట్ లపైన కూడా రాజకీయపరమైన కక్ష సాధింపులకు దిగింది. మా హయాంలో వచ్చిన జిందాల్ వంటి సంస్థలను భయపెట్టి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయేందుకు కారణమయ్యారు. రాజకీయ పరమైన కక్షతో, గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెడతామన్నందుకు జిందాల్ వంటి పెద్ద సంస్థలను తరిమికొట్టారు.
వాస్తవాలు దాచి చంద్రబాబు అసత్య ప్రచారం:
2019–24 మధ్యలో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెబుతున్న చంద్రబాబు వాస్తవాలను దాచిపెట్టి మాట్లాడుతున్నారు. 2019 నాటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉంటే, 2024 నాటికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 15వ స్థానంకు పెరిగింది. అంటే వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎంత ప్రగతిని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామిక ప్రగతిలో 2019 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి 11వ స్థానంలో ఉంటే, 2024 నాటకి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో 9వ స్థానంలో నిలబెట్టడం జరిగింది. ఇటువంటి మంచి ర్యాంకింగ్ లను సాధించిన చరిత్ర వైయస్ఆర్ సీపీ ప్రభుత్వానిది. దీనిని వక్రీకరించి రాజకీయ అవసరాల కోసం దుష్ప్రచారం చేయడం దారుణం. వైయస్ఆర్ సీపీ హయాంలో జెఎస్ డబ్లు్య, ఆదానీ గ్రీన్ ప్రాజెక్ట్ లను తీసుకువచ్చాం. ఎన్డీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ను తీసుకువచ్చాం. దక్షిణ భారతదేశంలోనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి మరీ దక్కించుకుంది.
ప్రచారం కోసం కోట్ల ప్రజాధనం:
సీఎం చంద్రబాబు తన దావోస్ పర్యటనను విస్తృతంగా ప్రచారం చూసేలా జాతీయ న్యూస్ ఛానల్స్‌కు దాదాపు మూడున్నర కోట్లు ఇచ్చారు. అదే కాకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోంస కేవలం ఐ అండ్ పీఆర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ఏజెన్సీ నియమించుకోవాలని తాజాగా నిర్ణయించడం దారుణం. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక, ఏదైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తేనే కదా మీకు ప్రజల్లో ప్రచారం జరగడానికి? మంచిపేరు రావడానికి?.
ఎనిమిది నెలలు అవుతున్నా మీరు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కేవలం ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ గారి మీద నిత్యం విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. ప్రపంచ వేదికలపైన కూడా మీ అరాచకాన్ని ప్రకటించుకుని రాష్ట్రం పరువును తీశారు. ఇందు కోసం ప్రజాధనంను ఖర్చు చేశారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటా దావోస్ వెళ్ళి ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తెస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆలీబాబా, ఎయిర్ బస్ ప్రాజెక్ట్‌లు వచ్చేస్తున్నాయంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ ఏవీ ఆ ప్రాజెక్ట్‌లు?
ఇప్పుడు కూడా దావోస్ నుంచి తిరిగి వస్తూ కూడా ఇదే తరహాలో ప్రజలకు అబద్దాలు చెప్పేందుకు చంద్రబాబు బృందం సిద్ధమవుతోందని అమర్నాథ్ ఆక్షేపించారు.