Best Web Hosting Provider In India 2024
Koushik Reddy: గులాబీ పూలు ఇచ్చి… దండం పెట్టి… నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Koushik Reddy: బిఆర్ఎస్ కు చెందిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రజాపాలన గ్రామసభల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన తెలిపారు. రొటీన్ కు భిన్నంగా గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని గులాబీలు ఇచ్చి నిరసన తెలిపారు.
Koushik Reddy: అధికారులకు గులాబీ పూలు ఇచ్చి దండం పెట్టి, దరఖాస్తు చేసుకున్న నిరుపేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాజకీయంగా దూకుడుగా వ్యవహరించే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా పాలన గ్రామసభల్లో వెరైటీగా నిరసన తెలిపారు. వీణవంక మండలం చల్లూరు, జమ్మికుంట మండలం సైదాబాద్ లో జరిగిన గ్రామసభల్లో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి రాకతో పోలీసులు భారీగా మోహరించారు.
అంతా ఏమవుతుందోనని భావించినా ఎమ్మెల్యే వెరైటీ గా గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని లబ్ధిదారుల జాబితాపై గ్రామస్తులు నిలదీస్తుంటే వారికి శృతి కలిపారు. నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు చదవగా తనకు వినబడటం లేదని వేదిక పై నుంచి దిగి ప్రజలతో మమేకమై వేదిక ఎదురుగా కూర్చున్నారు.
గతంలో ఇళ్ళ కోసం, ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం అప్లై చేసుకున్న ఎందుకు ఇవ్వలేదని అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. భూములు ఉన్న వారికి జాబ్ కార్డులు ఇవ్వలేమని అధికారులు తెలుపడంతో రైతు కూలీలు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చల్లూరులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైదాబాద్ లో గులాబీ పూలు ఇచ్చి దండం పెట్టిన ఎమ్మెల్యే..
సైదాబాద్ లో ఎమ్మెల్యే నేలపై కూర్చుని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని అధికారులకు గులాబీ పూలు ఇచ్చి వేడుకున్నారు. నియోజకవర్గానికి 3500 మంజూరు చేసిన ప్రభుత్వం ఏ గ్రామంలో ఎంతమందికి ఇళ్ళు ఇదిస్తున్నారో జాబితా ప్రకటించకపోవడం విచారకరం అన్నారు. దయచేసి దండం పెట్టి వేడుకుంటున్నా… నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం అందించాలని కోరారు. నిలదీస్తే పోలీసులు కేసులు పెడుతారు, అందుకే అధికారులకు దండం పెట్టి వేడుకుంటున్నానని రెండు చేతులు జోడించి మొక్కారు.
అవాక్కైన గ్రామస్తులు..
ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తూ హల్ చల్ చేసే ఎమ్మెల్యే సైలెంట్ గా కూర్చుండి అధికారులకు గులాబీ పూలు ఇచ్చి దండం పెట్టి వేడుకోవడం చూసి గ్రామస్తులు అవాక్కై ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే 28 కేసులు నమోదు కావడంతో కేసులకు భయపడి ఇలా చేశాడా? లేక ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు వచ్చిందా? అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సావధానంగా ఎమ్మెల్యే ప్రజాసమస్యలు విని పరిష్కరించే దిశగా కృషి చేస్తే సంతోషిస్తామని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్